తెలంగాణ కల నెరవేరుస్తున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సుదీర్గకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజల సుదీర్గకాల ఆకాంక్ష నెరవేర్చేందుకు వేగంగా ముందుకు సాగుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేయలేని పనులు ఏవో వివరాలు రాసుకొని... వాటిని పూర్తి చేయడమే తన ఉద్దేశం అన్నట్లుగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ ఈ క్రమంలో తాజాగా కీలక ముందడుగు వేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా పేరొంది, అభివృద్ధిలో వ్యూహాత్మకంగా ఎదుగుతున్న వరంగల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక నిర్ణయం తీసుకున్నారు. `వరంగల్ ఎయిర్‌పోర్ట్ కల` నెరవేర్చేందుకు కీలక అడుగు పడేలా చేశారు.
హైదరాబాద్‌కు ధీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగా, సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ జిల్లా కేంద్రంలోని మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కీలక ఆదేశాలు ఇచ్చారు. వరంగల్ లో ఇప్పటికే విమానాశ్రయం ఉన్నప్పటికీ రెండు కారణాల వల్ల అది వాణిజ్య కార్యకలాపాలు అమలు వేదికగా కాలేదు. ఒకటి జీఎంఆర్ సంస్థ. రెండోది స్థానికంగా భూమి లభ్యత.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మించే సమయంలో, 150 కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్‌పోర్ట్ నిర్మించవద్దని జీఎమ్మాఆర్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందువల్ల వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ముందుకు సాగలేదు. అయితే, వరంగల్ జిల్లా మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న ఈ నిబంధనను జీఎంఆర్ వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసింది. ఇక ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన భూ సేకరణ. ఇప్పటికే ఎయిర్ పోర్ట్ పరిధిలో 696 ఎకరాల భూమిని గుర్తించారు. అయితే, ఇందుకు భూ సేకరణ సమస్య ఎదురైంది.
మొత్తం 696 ఎకరాల భూమిలో 253 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. దీంతో ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణకు రూ. 205 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. దీంతో భూసేకరణ వేగంగా ముందుకు సాగనుంది. కాగా, 253 ఎకరాల భూమిలో కొంత రన్ వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్), నెవిగేషనల్ ఇన్ స్ట్రూమెంట్ ఇన్ స్టలేషన్ విభాగాల కోసం నిర్మాణాల కోసం వినియోగిస్తారు. అంతేకాకుండా, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపిఆర్ ను సిద్ధం చేయాలని ఎయిర్ పోర్ట్ అథారిటీకి ఆర్ ఆండ్ బీ శాఖ లేఖ రాసింది.
ఈ నెల 19న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎయిర్ పోర్టు నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లుగా సమాచారం. వరంగల్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వరంగల్ విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా తెలంగాణ ప్రజల సుదీర్ఘ కాంక్ష అయిన రెండో విమానాశ్రయానికి సైతం ఓకే చేస్తుండటం రేవంత్ రెడ్డికి తప్పకుండా మైలేజీగా మారే అంశమని పేర్కొంటున్నారు.