'నా కుటుంబం కబ్జా చేసినట్లు నిరూపిస్తే'... రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం తెలంగాణలో "హైడ్రా" వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే.

Update: 2024-08-28 11:28 GMT

ప్రస్తుతం తెలంగాణలో "హైడ్రా" వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. చెరువులను ఎఫ్.టీ.ఎల్., బఫర్ జోన్ లలో ఎవరు నిర్మాణాలు చేసినా.. ఏ మాత్రం ఉపేక్షించేది లేదంటూ హైడ్రా విరుచుకుపడుతుంది.. ఉదయాన్నే బుల్డోజర్లతో అక్కడ వాలిపోతుంది.. మధ్యాహ్నానికి పని పూర్తి చేసేస్తున్న పరిస్థితి!

ఈ సమయంలో రేవంత్ సర్కార్ పై పలు వర్గాల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తుండగా.. ఇంకొంతమంది మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయిన రేవంత్ రెడ్డి.. అధర్మంపై ధర్మం గెలవాలంటే యుద్ధం అనివార్యం అన్నట్లుగా వ్యాఖ్యానించారు కూడా!

ఈ క్రమంలోనే తాజాగా మరోసారి హైడ్రా వ్యవహారంపై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఎఫ్.టీ.ఎల్., బఫర్ జోన్ లలో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా స్పందించిన రేవంత్... హైడ్రా దూకుడు ఆగదన్నట్లుగానే స్పందించారు. ఎఫ్.టీ.ఎల్., బఫర్ జోన్, చెరువులు, నాళాలపై కూల్చివేతలకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టిందే కాంగ్రెస్ నేత పల్లంరాజు నుంచని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేటీఆర్ తన ఫామ్ హౌస్ కి అనుమతి సర్పంచ్ నుంచి తీసుకున్నట్లు చెబుతున్నారని.. సర్పంచులు ఎలాంటి అధికారిక అనుమతులు ఇవ్వరని రేవంత్ తెలిపారు. అసలు జన్వాడ ఫామ్ హౌస్ లీజుకు తీసుకున్నట్లు ఎన్నికల అఫిడవిట్ లో కేటీఆర్ ఎందుకు ప్రస్థావించలేదని ప్రశ్నించారు. ప్రజా ప్రయోజనాల కోసమే కూల్చివేతలని పునరుద్ఘాటించారు.

ఈ నేపథ్యంలోనే... తన కుటుంబం కబ్జా చేసినట్లు కేటీఆర్ చూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానని రేవంత్ స్పష్టం చేశారు. 30 ఏళ్ల కిందట కట్టిన అక్రమ నిర్మాణాలైనా సరే హైడ్రా చర్యలు తీసుకుంటుందని.. ఈ విషయంలో హరీష్ రావు సిద్ధమైతే ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్ధారణ కమిటీ వేస్తామని రేవంత్ తెలిపారు.

Tags:    

Similar News