జర్నలిస్టు పదానికి మీరే అర్థం చెప్పండి: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
దీనికి తోడు స్వతంత్ర జర్నలిస్టులు కొందరు.. యూట్యూబుల్లో చర్చలు పెడుతున్నారు.
జర్నలిస్టులపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ''జర్నలిస్టు పదానికి అసలు అర్థం మీరే చెప్పండి'' అని ఆయన వ్యాఖ్యానించారు. ఖమ్మంలో వరదలు.. వర్షాలు.. హైదరాబాద్‌లో హైడ్రా దూకుడు నేపథ్యంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వస్తున్నాయి. దీనికి తోడు స్వతంత్ర జర్నలిస్టులు కొందరు.. యూట్యూబుల్లో చర్చలు పెడుతున్నారు. వీటిలో హైడ్రాపై ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రేవంత్ తన అసహనం వ్యక్తం చేశారు.
''అసలు కంటే కొసరు ఎక్కువైంది. మేము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో మీరే చెప్పండి. జర్నలిస్టు పదానికి అర్థం మీరే చెప్పండి'' అని సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ''ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే.. అసలు కంటే కొసరుదే ఎక్కువైంది. ఎవరిది యూట్యూబో తెలుస్తలేదు. ఎక్కడపడితే అక్కడ వెళ్లిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమన్నా అంటే చూశారా జర్నలిస్టులపై దాడి అంటూ చెబుతున్నారు'' అని వ్యాఖ్యానించారు.
'జర్నలిస్టు' పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అంతేకాదు.. ప్రభుత్వ పరంగా తాము ఎవరిని జర్నలిస్టుగా చూడాలో కూడా జర్నలిస్టులే చెప్పాలన్నారు. ''మెడలో పట్టీలు వేసుకొని, ఆ ట్యూబ్.. ఈ ట్యూబ్ కు నేను జర్నలిస్టును అని బయలుదేరితే... వాళ్లు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారు'' అని అన్నారు. ఒక పద్ధతి ప్రకారం.. జర్నలిస్టులు నడుచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.
తాను ఎవరినీ తప్పుపడతలేనని చెప్పిన ముఖ్యమంత్రి.. కొందరు చేస్తున్న ప్రచారంతో ప్రజలు ప్రభావి తులవుతున్నారని వ్యాఖ్యానించారు. దీనిని అరికట్టాల్సిన అవసరం అందరిపైనా ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ఏదో జరగకూడనిది జరిగిపోతోందని.. ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇస్తే.. తీసుకుంటామన్నారు. కానీ, జర్నలిస్టుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన సూచించారు.