బీజేపీకి 400 సీట్ల అంచనాపై రేవంత్ లెక్కలు విన్నారా?
ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఐదు దశలు పూర్తి కావటం.. చివరి రెండు దశలకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.
ఏడు దశల్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇప్పటికే ఐదు దశలు పూర్తి కావటం.. చివరి రెండు దశలకు సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజా ఎన్నికల్లో 400 సీట్లు ఖాయంగా తమకు వస్తాయని కమలనాథులు నమ్మకంగా చెబుతుంటే.. ఇండియా కూటమి మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. అంతేకాదు.. తమ గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ లోపు ఎవరి అంచనాలు వారు చెప్పేస్తున్నారు. గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సీఎం నుంచి సామాన్యుడు వరకు ఎవరూ మినహాయింపు కాదు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్నట్లుగా 400 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో రావని వాదించే ప్రముఖుల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకరు. బీజేపీకి 400 సీట్లు రావాలంటే పాకిస్థాన్ లో వెళ్లి పోటీ చేయాలంటూ ఆయన చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ఇప్పటికే జాతీయ స్థాయిలో పేలింది. ఇదే మాటను పలువురు బీజేపీకి పంచ్ వేసేందుకు వాడటం తెలిసిందే. సోమవారం కేరళకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అక్కడో పుస్తకావిష్కరణ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ మీదా.. బీజేపీ అధినాయకత్వంపై తనదైన శైలిలో చురకలు వేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో 400 సీట్లు బీజేపీ వచ్చే ఛాన్సు లేదన్న ఆయన.. అందుకు తగ్గట్లు తన వాదనను అంకెల రూపంలో వెల్లడించటం ఆసక్తికరంగా మారింది. బీజేపీకి 400 సీట్లు వచ్చే ఛాన్సు లేదన్న రేవంత్ లెక్కను ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి దక్షిణాది రాష్ట్రాలు వందకుపైగా సీట్లు ఇవ్వనున్నాయి. దక్షిణాదిలో మొత్తం 121 సీట్లు ఉంటే.. కేరళ, తమిళనాడుల్లో బీజేపీకి చోటే లేదు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఆ పార్టీకి వచ్చే సీట్లు 20 కంటే తక్కువే. గత ఎన్నికల్లో బీజేపీకి గుజరాత్, హరియాణా, ఢిల్లీ, రాజస్థాన్‌లలో మొత్తం సీట్లు వచ్చాయి. ఈసారి ఆయా రాష్ట్రాల్లో సగం సీట్లు కూడా రావు. మరి, ఆ పార్టీకి ఈ ఎన్నికల్లో 400 సీట్లు ఇంకెక్కడి నుంచి వస్తాయి?’’ అంటూ తన లెక్కను చెప్పుకొచ్చారు.
బీజేపీ నేతలు కోరుకున్నట్లు 400 సీట్లు కావాలంటే పాకిస్థాన్ ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సిందే అంటూ తన మార్క్ సెటైర్ ను మరోసారి సంధించారు. సయ్యద్ సాదిక్ అలీ షిహాబ్ తంగల్ రాసిన ‘స్నేహ సదస్సు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం కేరళలోని కొజికోడ్‌లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఆధ్వర్యంలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్ బీజేపీపై విరుచుకుపడ్డారు.
ఈసారి ఎన్నికల్లో మతతత్వ శక్తులు 400 సీట్లు అడిగేది రాజ్యాంగాన్ని మార్చి.. రిజర్వేషన్లను రద్దు చేసేందుకే అన్న రేవంత్.. ‘‘అందరమూ కలిసి మతతత్వ శక్తులను ఓడించి.. రాజ్యాంగాన్ని రక్షించే బాధ్యత తీసుకోవాలి. మతతత్వ శక్తులను కేరళ ప్రజలు వారి రాష్ట్రంలోకి అనుమతించరు. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతున్న వారితో కలిసి ఈ వేదిక పంచుకుంటున్నందుకు గర్వపడుతున్నాను’’ అని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించేందుకు తాను ఎంతగానో ప్రయత్నించానని, కానీ, కేరళ తన కుటుంబమని, తాను ఈసారీ వయనాడ్ నుంచే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారంటూ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. గడిచిన పదేళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న మోడీ.. దేశంలోని కొంత మందికి వ్యతిరేకంగా మాట్లాడడం దేశానికి మంచిది కాదంటూ తప్పుబట్టారు. మతతత్వ శక్తులను చొప్పించేందుకు బీజేపీ ఎంత ప్రయత్నించినా వారికి ఒక్క ఇంచు కూడా జాగా ఇవ్వని కేరళ సమాజం.. హిందుస్థాన్‌కు రోల్ మోడల్ అని వ్యాఖ్యానించారు. కేరళ నుంచి దేశం నేర్చుకోవాల్సింది చాలానే ఉందన్న ఆయన.. కేరళ మోడల్ పాలిటిక్స్ దేశానికి చాలా అవసరమని వ్యాఖ్యానించారు. మొత్తానికి కమలనాథులకు కౌంటర్లు ఇచ్చేందుకు తనకు లభించిన అవకాశాన్ని నూటికి నూరు శాతం సీఎం రేవంత్ వినియోగించుకున్నారని చెప్పక తప్పదు.