తెలంగాణ కొత్త మంత్రులు వీరే.. జాబితాతో ఢిల్లీకి సీఎం రేవంత్?
రేవంత్ రెడ్డి గత వారమే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో పూర్తిగా మాట్లాడి వచ్చారు.
సరిగ్గా 9 నెలలు అవుతోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి.. మధ్యలో దాదాపు రెండు నెలలు లోక్ సభ ఎన్నికల కారణంగా ఎలాంటి కార్యక్రమమూ చేపట్టలేని పరిస్థితి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీ, ప్రభుత్వ పథకాల వెల్లడి తదితర కార్యక్రమాలన్నీ ఆగిపోయాయి. మరీ ముఖ్యమైన టీపీసీసీ చీఫ్ పదవిలోకి కొత్త నాయకుడిని నియమించడం కూడా నిలిచిపోయింది. శాసన మండలిలో ఖాళీల భర్తీ, బీఆర్ఎష్ నుంచి వలసలు కూడా కొంత అడ్డంకి అయింది. ఇవన్నీ తొలగిపోయాయి అనుకుంటుండగా ఆషాఢం వచ్చేసింది. కానీ, ఇప్పుడు అన్నీ తీరిపోయాయి. మొన్నటివరకు అటు పార్టీ రాష్ట్ర సారథిగా, ఇటు ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డి ఇకమీదట పూర్తిగా పాలనపైనే ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి. అందులోనూ ప్రతిపక్ష బీఆర్ఎస్ తన దాడిని ముమ్మరం చేసింది. ఎలాగూ పక్కలో బల్లెంలా బీజేపీ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాల్సిందే.
ఢిల్లీ మిఠాయి..
రేవంత్ రెడ్డి గత వారమే ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో పూర్తిగా మాట్లాడి వచ్చారు. అప్పుడే టీపీసీసీ చీఫ్, నామినేటెడ్ పదవులు, మంత్రివర్గ విస్తరణపై ఓ ప్రకటన రావొచ్చని భావించారు. కానీ, అదేమీ జరగలేదు. దీంతో పార్టీ వర్గాలు, మీడియా ఆశ్చర్యపోయాయి. అయితే, గురువారం మరోసారి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇక ఆలస్యం చేయకుండా ఢిల్లీ మిఠాయి అందించనున్నట్లు స్పష్టం అవుతోంది.
కేబినెట్ బెర్తులు వీరికే..
తెలంగాణ కేబినెట్ లో ఆరు ఖాళీలు ఉన్నాయి. నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, రంగారెడ్డిల నుంచి ఎవరూ మంత్రులుగా లేరు. అతి ముఖ్యమైన హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రులు లేకపోవడం ఇబ్బందికరమే. ఇక తాజా మంత్రివర్గ విస్తరణతో ఆ లోటు తీరనుంది. నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, ఆదిలాబాద్ నుంచి గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, హైదరాబాద్ నుంచి ఆమేర్ అలీ ఖాన్, రంగారెడ్డిలో మల్ రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, నల్లగొండలో బాలూ నాయక్ లకే కాక రాంచందర్ నాయక్ లలో ఆరుగురికి అమాత్య యోగం ఉందని తెలుస్తోంది. ఇందులో సామాజిక, జిల్లా సమీకరణాల ప్రకారం కొందరు పక్కకు వెళ్లే అవకాశం ఉంది. అసెంబ్లీలో ముఖ్యమైన చీఫ్ విప్ పదవి వీరిలో ఒకరికి దక్కొచ్చని చెబుతున్నారు.