జగన్ వర్సెస్ రేవంత్...!

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు యువ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇద్దరూ సీఎం పోస్ట్ మీద గురి పెట్టి మరీ దానిని అందుకున్న వారే

Update: 2024-01-17 09:46 GMT

రెండు తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు యువ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఇద్దరూ సీఎం పోస్ట్ మీద గురి పెట్టి మరీ దానిని అందుకున్న వారే. ఇద్దరూ ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఆ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన వారే. ఇద్దరూ జైలుకు వెళ్ళి వచ్చిన వారే. ఇద్దరికీ రాజకీయంగా పట్టుదలలూ పంతాలూ ఉన్నాయి. జగన్ కి తనను జైలులో పెట్టిన కాంగ్రెస్ అంటే జీవిత కాలం ద్వేషం. అలాగే రేవంత్ రెడ్డికి తనను జైలు పాలు చేసిన బీఆర్ఎస్ అంటే శాశ్వత శతృత్వం.

ఇలా ఇద్దరు నేతలకూ ఎన్నో పోలికలు ఉన్నాయి. అంతే కాదు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. దీంతో ఈ ఇద్దరిని ప్రతీ దానికీ సరిపోల్చి చూడడం అన్నది అలవాటుగా మారుతోంది. ఒక తెలుగు రాష్ట్రంలో ఏదైనా జరిగితే దాన్ని రెండవ రాష్ట్రంతో పోలిక పెట్టడం తేడా ఉంటే చూడడం అన్నది అలవాటు అయింది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో చూసుకుంటే జగన్ నాలుగున్నరేళ్ల పాటు సీఎం గా పదవిలో ఉన్నాక తెలంగాణాకు రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. రెవంత్ రెడ్డి సీఎం అనుభవం రెండు నెలలు మాత్రమే. అయినా సరే ఏపీ తెలంగాణాలో ఇద్దరు ముఖ్యమంత్రుల పాలన మీద విశ్లేషణలు అయితే ఉన్నాయి.

ఈ పోలికల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ వైఎస్సార్ కాంగ్రెస్ అంటే కుదరదు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఏపీలో వర్కౌట్ కాదు. ఇక తెలంగాణాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్నది లేదు. అయితే ఇద్దరు రెడ్లు రెండు చోట రాజ్యం చేస్తున్న అరుదైన రాజకీయ సన్నివేశం ఉంది కాబట్టే జగన్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని ఇద్దరి గురించి అంతలా మాట్లాడుకోవడం.

ఇక ఈ ఇద్దరు రెడ్లలో ఎవరు బాగా పనిచేస్తున్నారు అన్నది రెడ్డి సామాజిక వరం కూడా చాలా ఆసక్తిగా లోతైన విశ్లేషణతో చూస్తోంది. అలాగే జన సామాన్యం కూడా దీని మీదనే చర్చిసోంది. జగన్ అయితే డబ్బులు ఇస్తూ డైరెక్ట్ నగదు బదిలీ పధకాన్ని ఏపీలో అమలు చేస్తున్నారు. ఏపీలో చాలా పధకాలు ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలీ అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్ ఏపీలో సంక్షేమ పాలన చేస్తున్నారు.

ఇక జగన్ పధకాలు అన్నీ కూడా వాలంటీర్ల ద్వారానే జరిగిపోతున్నాయి. ఎక్కడా క్యాడర్ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. దాంతో పార్టీ పరంగా చూస్తే ఎక్కువ మైలేజ్ అయితే వైసీపీకి రావడం లేదు అన్న చర్చ అయితే ఉంది. అదే తెలంగాణాలో చూసుకుంటే మాత్రం మొన్ననే గెలిచి కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం అయిన రేవంత్ రెడ్డి మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. నిజానికి ఇది కూడా సంక్షేమ పధకమే.

ఈ పధకం ఇపుడు తెలంగాణాలో రేవంత్ ప్రభుత్వాన్నికి ఎక్కడ లేని మైలేజ్ తెచ్చిపెడుతోంది. ఎందుకంటే ప్రజా రవాణా సదుపాయాన్ని మహిళలకు ఉచితంగా రేవంత్ రెడ్డి కలుగజేశారు. దాంతో అది బ్రహ్మాండమైన పబ్లిసిటీకి నోచుకుంది. పైగా ప్రతీ రోజూ ప్రయాణం ఉంటుంది.దాంతో ఈ ఫ్రీ బస్ స్కీం అన్నది మూడు వందల అరవై అయిదు రోజులూ ఫుల్ పబ్లిసిటీగానే ఉంటోంది.

అయితే ఈ ఫ్రీ బస్ స్కీం కి అయ్యే ఖర్చు కంటే పదింతలు ఖర్చు చేసి అనేక పధకాలను ఏపీలో వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు. కానీ వాటిని అనుకున్న మైలేజ్ రాకపోవడానికి అవి సీజనల్ పధకాలు కావడమే అంటున్నారు. పైగా వాలంటీర్ల వ్యవస్థ అని మాధ్యలో ఒక దాన్ని పెట్టి అమలు చేయడం వల్ల కూడా పార్టీకి మైలేజ్ ఆశించిన స్థాయిలో రాలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా సంక్షేమం విషయంలో జగన్ అందరి కంటే చాలా ముందే ఉన్నారు. కానీ ప్రచారం మాత్రం ఇంకా రావాల్సి ఉంది. దానికి ఏమి చేయాలో వైసీపీ ఎన్నికల వేళలో ఆలోచించుకోవాలి.

ఇక తెలంగాణాలో సూక్షంలో మోక్షం మాదిరిగా ఫ్రీ బస్ స్కీం అయితే రేవంత్ రెడ్డి కి ఎక్కడ లేని పేరు తెచ్చేసింది. మరి ఏపీ సర్కార్ దీనిని కూడా సీరియస్ గా పరిశీలిస్తుందా. చూడాల్సి ఉంది.

Tags:    

Similar News