మీసం తిప్పుతున్న రేవంత్.. తెరపైకి కేసీఆర్ కు రిటన్ గిఫ్ట్!
తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఎగ్జాట్ పోల్ ఫలితాలు విడుదలవుతున్నాయి
తెలంగాణలో ఎగ్జిట్ పోల్ ఫలితాలను నిజం చేస్తూ ఎగ్జాట్ పోల్ ఫలితాలు విడుదలవుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించే దిశగా ముందుకు వెళ్తుంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిన స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై పడింది. ఈ సమయంలో రేవంత్ కి సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది.
అవును... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీకి సోనియా గాంధీకీ రుణం తీర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లుగానే తాజాగా ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఈ సమయంలో తాజాగా తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ఇప్పటికే రేవంత్ రెడ్డిని కలిశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ సమయంలో ఉదయం నుంచీ రేవంత్ ఇంటి వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. మరోపక్క సీఎం సీఎం అనే నినాదాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీ ర్యాలీతో రేవంత్ రెడ్డి తన ఇంటి నుంచి గాంధీ భవన్ కు బయలుదేరారు. దీంతో తెలంగాణకు కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అనే చర్చ బలంగా నడుస్తుంది. ఇదే సమయంలో రేవంత్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ అవుతుంది.
ఇందులో భాగంగా... 2015లో ఓటుకు నోటు కేసులో రేవంత్ జైలుకెళ్లినప్పుడు తీసిన ఫోటో ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. ఈ ఫోటోలో మీసం తిప్పుతున్న రేవంత్ రెడ్డి... కేసీఆర్ కు ఏదో ఒకరోజు తగిన రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని శపథం చేశారు. ఈ సమయంలో తన కుమార్తె నిశ్చితార్థానికి హాజరు కావడానికి రేవంత్ కు కేవలం 12 గంటల పాటు మాత్రమే బెయిల్ ఇవ్వడం మరింత చర్చనీయాంశం అయ్యింది.
ఫలితంగా... ఆ రోజు తనపై విధించిన బెయిల్ ఆంక్షల కారణంగా తన కుమార్తె వివాహ వేడుకలను హడావిడిగా నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈ ఘటనపై రేవంత్ నిప్పులు కక్కారు. పట్టుదలతో పని చేశారు.. కసితో ప్రచారం చేశారు. డూ ఆర్ డై అనే స్థాయిలో బీఆరెస్స్ పై యుద్ధం చేశారు. ఈ సమయంలో అందుకు తగిన ఫలితం పొందే అవకాశం వచ్చిందని తెలుస్తుంది. దీంతో కేసీఆర్ కు రిటన్ గిఫ్ట్ కన్ ఫాం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.