కాంగ్రెస్ చరిత్రలోనే రేవంత్ ఒక రికార్డు.. అదెలానంటే?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నారు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్రలో ఇదో రికార్డు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నేత.. పార్టీలోకి వచ్చిన రెండున్నరేళ్ల స్వల్ప వ్యవధిలోనే.. ఎలాంటి మంత్రి పదవిని చేపట్టకుండా ఏకంగా సీఎం కావటం చాలా అరుదైన వ్యవహారంగా చెబుతున్నారు. ఓటుకు నోటు లాంటి సంచలన ఆరోపణల నడుమ పార్టీలోకి వచ్చిన కొద్ది కాలానికే పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక కావటం.. తర్వాత ఎన్నికల్లో ఏకంగా ముఖ్యమంత్రి కావటం ఒక విశేషంగా చెప్పాలి. అయితే.. ఇదంతా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ అనే కన్నా.. రేవంత్ కష్టమని మాత్రమే చెప్పాలి.
ఐదేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీతో కలిసి తెలంగాణలోపోటీ చేసినప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అందరికి తెలిసిందే. ఎన్నికల్లో గెలిచిన పార్టీ ఎమ్మెల్యేల్లో అధిక భాగం ఇప్పటి బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ లోకివెళ్లిపోవటం ఒక ఎత్తు అయితే.. మిగిలిన ఎమ్మెల్యేల కంటే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి కుర్చీ కోసం కోట్లాడుకునే నేతలే ఎక్కువగా ఉంటారన్న జోక్ ఉండేది. అలాంటి పార్టీని విజయ తీరాలకు తీసుకెళ్లటం అంత తేలికైన విషయం కాు.
రేవంత్ కు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం ఎంత క్లారిటీగా ఉందన్న దానికి.. ఆయన్ను ఎంపిక చేసిన విధానమే నిదర్శనంగా చెప్పాలి. రికార్డు స్థాయిలో రేవంత్ ను సీఎంగా అనౌన్స్ చేయటానికి 48గంటల స్వల్ప సమయమే తీసుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంపిక చేసినట్లుగా ప్రకటించటానికి ఇంతకు మించిన సమయాన్నే తీసుకున్నారు. అందుకు భిన్నంగా జెట్ స్పీడ్ తో రేవంత్ ఎంపిక పూర్తి అయ్యిందని చెప్పాలి.
నిజానికి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలోనే.. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం తర్వాతి రోజే ఉంటుందన్న వార్తలు రావటం తెలిసిందే. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెను వెంటనే ప్రమాణస్వీకారాన్ని పూర్తిచేయాలని భావించినా.. భట్టి.. ఉత్తమ్.. లాంటి వారి కారణంగా కాస్తంత పీటముడి పడింది. అయినప్పటికి ఈ మాత్రం వేగంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం కాంగ్రెస్ లో అరుదైన అంశంగా చెబుతున్నారు. ఏమైనా.. ఈ క్రెడిట్ అంతా రేవంత్ ఖాతాలోనే పడటం గమనార్హం.