కేబినెట్ విస్తరణపై రేవంత్ గురి.. రేసులో ఉన్నది వీరే

సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. అంచనాలకు తగ్గట్లే ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది.

Update: 2023-12-18 05:19 GMT

సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ.. అంచనాలకు తగ్గట్లే ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. ఇలాంటి వేళ.. మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధినాయకత్వం ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంతకాలం అధికారం చేతిలో లేక అల్లాడిన నేతలకు.. వీలైనంత త్వరగా అధికారాల్ని కట్టబెట్టాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు. మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ.. అందరిని కలుపుకొని వెళ్లేలా చేయటం ఒక పని అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు లోక్ సభ ఎన్నికల వేళకు రిపీట్ చేయాల్సిన కఠిన పరీక్ష ఉంది.

ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రభుత్వాన్ని మరింత బలోపేతం చేయటంతో పాటు.. ప్రజల సానుకూలతను ఓట్ల ద్వారా అందరికి చాటి చెప్పాలన్నట్లుగా కాంగ్రెస్ అధినాయకత్వ ఆలోచనగా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే.. లోక్ సభ ఎన్నికలు కాస్త వేరుగా సాగుతాయి. అసెంబ్లీలో కాంగ్రెస్ కు ఓటేసిన వారు సైతం.. లోక్ సభ వచ్చేసరికి మోడీ ఫ్యాక్టర్ బలంగా పని చేస్తుంది. ఇదే విషయం 2019 సార్వత్రిక ఎన్నికల వేళలోనూ స్పష్టమైంది. 2018లో నాటి టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) చక్కటి మెజార్టీతో ఎన్నికల్లో విజయం సాధించగా.. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అందుకు భిన్నమైన ఫలితం ఎదురుకావటం తెలిసిందే. మోడీ అంశం కూడా ఒక కారణంగా చెప్పక తప్పదు.

ఇలాంటి పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంది. ఎందుకంటే.. మెజార్టీకి అవసరమైన 60స్థానాలకు అదనంగా నలుగురు మాత్రమే ఉన్నారన్నది మర్చిపోకూడదు. కమ్యునిస్టులు.. మజ్లిస్ ఎమ్మెల్యేలతో కలిపితే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. సొంత బలంతో పోలిస్తే.. అరువుగా వచ్చే బలం ఎప్పుడైనా మారే వీలుంది. ఇలాంటివేళ.. ఎన్నికల నాటికి మరింత బలోపేతం అయ్యేందుకు వీలుగా కాంగ్రెస్ పావులు కదుపుతోందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా మంత్రివర్గ విస్తరణతో పాటు.. నామినేటెడ్ పదవులకు సంబంధించిన నిర్ణయాల్ని వెంటవెంటనే తీసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇక.. కేబినెట్ విస్తరణ విషయానికి వస్తే.. పలువురు ఆశావాహులు మంత్రి పదవుల్ని ఆశిస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ నుంచి ఓడిన షబ్బీర్ అలీకి కానీ.. నాంపల్లిలో ఓడిన ఫిరోజ్ ఖాన్ లో ఒకరికి మైనార్టీ కోటాలో పదవి ఖాయమని చెబుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో ఏ ఒక్క స్థానంలోనూ కాంగ్రెస్ గెలవని పరిస్థితుల్లో నగరానికి చెందిన ఒకరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెబుతున్నారు.

ఇందులో భాగంగా మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిన మైనంపల్లి హన్మంతరావు.. ముషీరాబాద్ స్థానం నుంచి పోటీ చేసిన ఓడిన అంజన్ కుమార్ యాదవ్ లో ఒకరికి మంత్రి పదవి ఖాయమంటున్నారు. అయితే.. మైనంపల్లిని లోక్ సభ ఎన్నికల బరిలోకి దించాలన్న యోచనలో ఉన్న నేపథ్యంలో అంజన్ కు ఎక్కువ అవకాశాలు ఉంటాయమంటున్నారు. ఒకవేళ.. మంత్రివర్గంలో చోటు లభిస్తే ఆయన్ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాల్సి ఉంటుంది.

ఇక.. వివేక్ బ్రదర్స్ లో ఒకరికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి.. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తోపాటు ఉమ్మడి రంగారెడ్డిజిల్లా నుంచి ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది. మరి.. అంచనాలకు తగ్గట్లుగా మంత్రి పదవులు ఇస్తారా? లేదంటే.. ఆశ్చర్యానికి గురి చేసేలా మంత్రి పదవుల ఎంపిక ఉంటుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News