‘కడియం’తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై రేవంత్ నైతికత ‘బాణం’
ఏడు నెలల కిందటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన సమయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సమస్య అయితే.. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ఘోర ఓటమితో ఎంపీలే లేకుండా పోయారు. అసలు బీఆర్ఎస్ కు ఒక్క లోక్ సభ సభ్యుడూ లేకపోవడం ఆ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేంద్ర మంత్రిగా, ఉప ఎన్నికలు సహా ఐదుసార్లు ఎంపీగా గెలిచిన కేసీఆర్ కు ఇది అవమానకరమే.
డిపాజిట్లు రాలేదు.. ఇదే నిదర్శనం
ఏడు నెలల కిందటి వరకు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. లోక్ సభ ఎన్నికల్లో ఏడు సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఇక్కడ బీజేపీ గెలుపొందింది. దీంతోనే ఆ పార్టీ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలకు దిగుతున్నారు. బీజేపీ గెలుపు కోసం బీఆర్ఎస్ ఓట్లను మళ్లించిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు. దీనివెనుక కుమార్తె కవితకు బెయిల్ తదితర అంశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నైతిక కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. అంటే.. దీనర్థం.. బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైందని.. అలాంటి పార్టీలో కొనసాగడమా? లేదా? అనేది నిర్ణయించుకోవాలని సూచిస్తున్నారు.
కడియంను ముందు పెట్టి
బుధవారం సీనియర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ప్రెస్ మీట్ లో తనతో కూర్చోబెట్టుకుని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ‘నైతికత’ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవలి ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున నెగ్గిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. మొదట శ్రీహరిని బీఆర్ఎస్ ప్రతిపక్షంలో తమ వాయిస్ గా ఉపయోగించుకోవాలని చూసింది. కానీ, ఆయన అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక తన కుమార్తె కావ్యకు ఇచ్చిన వరంగల్ టికెట్ నూ కాదని తిరస్కరించి కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకున్నారు. ఆమె ఎన్నికల్లో గెలుపొంది ఎంపీ కావడం గమనార్హం.
కడియం శ్రీహరిని తన పక్కన కూర్చోబెట్టుకుని.. నైతికత అంశాన్ని ప్రస్తావించిన రేవంత్ బలమైన బాణాన్నే బీఆర్ఎస్ పైకి వదిలారు. ఓ విధంగా చెప్పాలంటే కడియంను ఉదాహరణగా చూపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమవైపు మలుపుకొనేందుకు చూస్తున్నారని తెలుస్తోంది.