జగన్ తో కేసీఆర్ కలిసి రేవంత్ ను దించబోతున్నారా?
ఆ విషయం ఆ పార్టీ వాళ్లు చెబుతున్నారని ఒక ప్రశ్న సంధించారు ఒక మీడియా అధిపతి. దీనికి సమాధానంగా స్పందించిన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అంటే... అడిగిన ప్రశ్న కూడా అలాంటిదనుకోండి అది వేరే విషయం! ఈ సందర్భంగా... కేసీఆర్ కు జగన్ ఒక ప్రామిస్ చేశారని.. లోక్ సభ ఎన్నికల అనంతరం తన వారితో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి, తెలంగాణలో మరోసారి కేసీఆర్ ని సీఎం చేస్తానని చెప్పారంట అనే ప్రశ్న రేవంత్ కి తాజాగా ఎదురైంది!
అవును... జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూల్చి కేసీఆర్ ని తిరిగి ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చారని.. ఆ మాట నమ్ముకుని కేసీఆర్ మాట్లాడుతున్నారని.. ఆ విషయం ఆ పార్టీ వాళ్లు చెబుతున్నారని ఒక ప్రశ్న సంధించారు ఒక మీడియా అధిపతి. దీనికి సమాధానంగా స్పందించిన రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇందులో భాగంగా... "నా దగ్గరున్న అరవై ఐదు మందితోనూ నా పర్సనల్ రిలేషన్ బాగుంది. ఆ అరవై ఐదు మందిలోనూ ఒక్కరే సీఎం కాగలరు కాబట్టి నేనైనా.. నేను కాకపోతే ఇంకొకరు కావాలి.. మా ఇద్దరినీ తీసేస్తే మిగిలింది 63 మంది.. వారిలో ఎవరైనా ఎవరితో కంఫర్ట్ ఉందనేది చూసుకుంటారు కదా!.. నా దగ్గర కంఫర్ట్ లేకపోతే, నేను ఎవరినీ కలవకుండా.. వాళ్లను మనుషుల్లాగానే నేను చూడలేదనుకో నేచురల్లీ ఏదో ఒక ఉపద్రవం వస్తాది" అని అన్నారు.
"కానీ.. మనం దానికి స్కోపే ఇస్తలేము. ఇదే సమయంలో మంత్రులు ఎవరి శాఖలను వారు స్వేచ్ఛగా, వాళ్ల అధికారులతో ప్రోపర్ గా నడుపుతున్నారు.. అవసరమైనప్పుడు మాత్రం నేను సూచనలు, సలహాలు ఇస్తున్నా.. నా దగ్గరకు రావాల్సిన ఫైలు మాత్రమే నా దగ్గరకు వస్తుంది.. లేకపోతే వారి నిర్ణయాల మేరకు నడుస్తుంది" అని వెల్లడించారు!
ఇదే సమయంలో.. తాను వార్ జోన్ లో ఉన్నప్పుడు ఎవరు చెప్పినా వినను కానీ... రూం లో కూర్చున్నప్పుడు మాత్రం ఎవరు ఏమి చెప్పినా వింటానని రేవంత్ తెలిపారు.