అక్కల మీద కోపం .. అసలు కథ ఇది ?!

సభలో జరుగుతున్న చర్చ అనూహ్యంగా రేవంత్ ఎందుకు అక్కల మీదికి మళ్లించాడని చర్చ జోరుగా నడుస్తుంది.

Update: 2024-08-02 12:30 GMT

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రశాంతంగా సాగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లతో సాఫీగా సాగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఆ అక్కలను నమ్మొద్దు అని చేసిన వ్యాఖ్యలతో సమావేశాలు వేడెక్కాయి. క్షమాపణలు కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు చేసిన నిరసనలతో అసెంబ్లీ అట్టుడికింది. సభలో జరుగుతున్న చర్చ అనూహ్యంగా రేవంత్ ఎందుకు అక్కల మీదికి మళ్లించాడని చర్చ జోరుగా నడుస్తుంది.

సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి, సీఎం రేవంత్ లు సన్నిహిత మితృలు. 2004 నుండి 2014 వరకు సబిత మంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ 2006లో జడ్పీటీసీ, 2008లో ఎమ్మెల్సీ, 2009లో ఎమ్మెల్యేగా టీడీపీ తరపున ఎన్నికయ్యాడు. అయినా వీరందరి మధ్య బలమైన సంబంధాలు ఉండేవి. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2017 లో రేవంత్ కాంగ్రెస్ లో చేరాడు. 2018 ఎన్నికల్లో కొడంగల్ నుండి ఎమ్మెల్యేగా రేవంత్ ఓడిపోగా, మహేశ్వరం నుండి సబితా ఇంద్రారెడ్డి గెలిచారు.

2019 లోక్ సభ ఎన్నికల్లో రేవంత్ మల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసి గెలవగా, చేవెళ్ల ఎంపీ టికెట్ సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి ఆశించాడు. కానీ రేవంత్ ప్రస్తుత చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అప్పట్లో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి ఎంపీగా నిలబెట్టారు. దీంతో సబితా ఇంద్రారెడ్డి, రేవంత్ ల మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత సబిత బీఆర్ఎస్ లో చేరారు.

గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, రేవంత్ ముఖ్యమంత్రి కావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టాలని ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టడం, పది ఎమ్మెల్యేలను చేర్చుకోవడం జరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను రేవంత్ కాంగ్రెస్ లోకి ఆహ్వానించినట్లుగా సమాచారం.

కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారు. సునీతా లక్ష్మారెడ్డికి మహిళా కమీషన్ చైర్మన్ గా అవకాశం ఇచ్చారు. ఇటీవల ఎన్నికల్లో నర్సాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ నేపథ్యంలో వీరిద్దరినీ పార్టీలో చేరాలని రేవంత్ ఆహ్వానించి ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్నారట. కానీ వీరిద్దరూ పార్టీ మారేందుకు అంగీకరించకపోవడంతో రాహుల్ వద్ద తనకు తలకొట్టేసినంత పనయిందట. అందుకే వారిద్దరి మీద రేవంత్ ఆ విధంగా స్పందించినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News