ఢిల్లీ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వచ్చిన రేవంత్ ఏం చేశారు?
అధికారికంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టని రేవంత్ రెడ్డి.. అనధికారికంగా మాత్రం వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటున్న వైనం ఆసక్తికరంగా మారింది.
అధికారికంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టని రేవంత్ రెడ్డి.. అనధికారికంగా మాత్రం వ్యవస్థల్ని తన చేతుల్లోకి తీసుకుంటున్న వైనం ఆసక్తికరంగా మారింది. ప్రమాణస్వీకారం అన్నది సాంకేతికం తప్పించి.. ఇంకేమీ లేదన్న వేళ.. ప్రభుత్వాన్ని నడిపించే కీలక అధికారులతో మంతనాల్ని మొదలు పెట్టేశారు రేవంత్ రెడ్డి. గురువారం మధ్యాహ్నం ఎల్ బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. సాయంత్రం ఆరు గంటల వేళకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోవాలి.
కానీ.. ఆయన రాత్రి పది గంటల వేళలో బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆయన కోసం అప్పటికే సీఎస్.. డీజీ మొదలు కీలక అధికారులు పలువురు వెయిట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఎయిర్ పోర్టులోనే ఆయన సదరు ఉన్నతాధికారులతో దాదాపు 40 నిమిషాలకు పైనే ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి చేసిన ఏర్పాట్లపై ఆరా తీయటమే కాదు.. రివ్యూ చేసినట్లుగా చెబుతున్నారు.
ప్రత్యేక విమానంలో ఎయిర్ పోర్టుకు చేరుకున్నకాసేపటికే బయటకు వస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి నిరాశే మిగిలింది. మొత్తంగా దాదాపు నలభై ఐదు నిమిషాల తర్వాత కానీ బయటకు రాలేదు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు లాంజ్ లో ఏం చేశారన్న విషయంపై ఆరా తీస్తే..రివ్యూ మాట బయటకు వచ్చింది. ఇదంతా చూస్తే.. అనధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతల్ని రేవంత్ నిర్వహిస్తున్నట్లుగా చెబుతున్నారు. కొసమెరుపు ఏమంటే.. తన పరిధిని.. పరిమితిని తెలుసుకున్న రీతిలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు రేవంత్.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చిన ఆయన.. తన ప్రైవేటు వాహనంలోనే వెళ్లిపోయారే తప్పించి.. ప్రభుత్వ వాహనాల్ని వినియోగించుకునే అత్యుత్సాహాన్ని ప్రదర్శించకపోవటం చూస్తే.. ఎంత చేయాలో అంత మాత్రమే తప్పించి.. కించిత్ కూడా ఎక్కువ చేయని వైనం కనిపిస్తుంది. మొత్తంగా ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తున్న వైనం చూస్తే.. రానున్న రోజుల్లో ఆయన తీరు ఇదే రీతిలో సాగుతుందా? లేదా? అన్నది ప్రశ్నగా మారిందని చెప్పాలి.