తిట్టేటప్పుడు లెక్క చూసుకోరు.. పొగిడేటప్పుడు సైతం.. రేవంత్ రూటే వేరు

ఎవరిని నొప్పించకుండా ఉండేలా కొన్నిసార్లు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.

Update: 2024-02-19 04:04 GMT

రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అదే తరహా తీరును ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. విజయవంతంగా రెండు నెలలు పదవీ కాలంలో ఉన్న ఆయన ఇప్పుడు రానున్న లోక్ సభ ఎన్నికల్ని ఎదుర్కొనే దిశగా ప్లానింగ్ చేస్తున్నారు. సీఎంగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఆయన భిన్నమైన పంథాలో వెళుతున్నారు. ఎవరిని నొప్పించకుండా ఉండేలా కొన్నిసార్లు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.

విపక్షమే కావొచ్చు.. వారిని సైతం కలుపుకుపోవాలన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో తిట్టాల్సి వచ్చినప్పుడు నిర్మోహమాటంగా తిట్టేయటం.. ముఖం పగిలే విమర్శలు చేయటం చేస్తున్నారు. ఎప్పుడూ తిట్టటమే కాదు.. కొన్నిసందర్భాల్లో ప్రత్యర్థులు చేసే మంచిని ప్రస్తావిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ తీరుకు భిన్నంగా రేవంత్ తీరు ఉంటోంది. ఇంట్లో నుంచి బయటకు రావటమే గగనం అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తే.. రేవంత్ అందుకు భిన్నంగా ఉంటుంది.

అందుబాటులో ఉండరన్న అపవాదు దగ్గరకు రానివ్వకుండా చురుగ్గా రేవంత్ వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు అనూహ్య రీతిలో వ్యవహరిస్తున్నారు. విపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానప్పటికీ.. ఆయన పుట్టిన రోజున అసెంబ్లీలో ప్రత్యేక ప్రకటన చేయటం గులాబీ నేతల మనసుల్ని దోచింది. ప్రైవేటు సంభాషణల్లో తమ అధినేత తన పదవీ కాలంలో ఎవరి విషయంలోనూ ఇలా చేయలేదన్న మాట పెద్ద ఎత్తున వినిపించటం గమనార్హం. ఇలా ఊహకు అందని రీతిలో ఆయన వ్యవహార శైలి ఉంటోంది.

తాజాగా అగ్నిమాపక శాఖకు సంబంధించిన భవనాన్ని క్రెడాయ్ తన సొంత నిధులతో నిర్మించగా.. దాన్ని ప్రారంభించేందుకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగర అభివృద్ధి కి గతంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన వారి మాదిరి తాను కూడా డెవలప్ మెంట్ చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత ముఖ్యమంత్రుల్ని ఉద్దేశించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంలుగా పని చేసిన చంద్రబాబు.. రాజశేఖర్ రెడ్డి.. కేసీఆర్ ల రాజకీయం.. ఆలోచన విధానం ఎలా ఉన్నా.. హైదరాబాద్ విషయంలో మాత్రం వారు అంతకు ముందున్న ప్రభుత్వాలు తీసుకున్న విధానాల్ని కొనసాగించారన్నారు. ఇదే సంప్రదాయాన్ని ఇక ముందు కూడా కొనసాగుతుందన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రుల అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని మరింత వేగంగా డెవలప్ మెంట్ వైపు హైదరాబాద్ ను నడిపించేందుకు కృషి చేస్తానని వ్యాఖ్యానించారు.

ఇలా భేషజాలకు పోకుండా గత ముఖ్యమంత్రులకు క్రెడిట్ ఇచ్చే విషయంలో మొహమాటపడని రేవంత్ తీరు చూస్తే.. తిట్టేటప్పుడు తిట్టటం.. పొగిడేటప్పుడు పొగడటం ద్వారా అన్ని విషయాల్లోనూ సాపేక్షంగా ఉన్నారన్న అభిప్రాయాన్ని కలిగించటంలో సక్సెస్ అవుతున్నారన్న మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ కు ఇదో ప్లస్ గా మారిందని చెప్పాలి. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన వేసే ప్రతి అడుగు రాజకీయమే అన్నట్లు కాకుండా.. మంచి చెడులను సమానంగా మాట్లాడటం ఇప్పటి రాజకీయంలో అరుదైన సంగతే. అదే తీరును ప్రదర్శిస్తూ అందరి మనసుల్ని దోచుకుంటున్నారు రేవంత్.

Tags:    

Similar News