నిమ్మల...బుడమేరుకు సరైన పాఠం చెప్పిన లెక్చరర్ !

విజయవాడను దారుణంగా ముంచేసిన బుడమేరుకు ఉన్న పేరు ఏమిటో తెలుసా. విజయవాడకు దుఖ దాయిని అని.

Update: 2024-09-07 15:35 GMT

విజయవాడను దారుణంగా ముంచేసిన బుడమేరుకు ఉన్న పేరు ఏమిటో తెలుసా. విజయవాడకు దుఖ దాయిని అని. అంటే ఆమె ఎపుడూ వర ప్రదాయిని కాదు, దుఖాన్నే అందిస్తుంది అన్న మాట. ఎన్నోసార్లు బుడమేరు విజయవాడను ముంచేసింది. తాజా భారీ వానల సమయంలో కూడా ఊరి మీద పడి కాలనీలకు కాలనీలను జలమయం చేసింది.

బుడమేరు కెపాసిటీకి మించి ప్రవహించిన వరద నీరుతో దిక్కుదోచని దుఖ దాయిని విజయవాడనే తన ప్రవాహానికి రాచబాట చేసుకుంది. ఫలితంగా ఎంతో ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. సాధారణంగా ఏరులు నదుల వద్ద ఉన్న గట్లను ఎప్పటికపుడు చూసుకుంటూ ఉండాలి.

తరచుగా తనిఖీలు చేయాలి. మరీ ముఖ్యంగా వానకాలంలో సరైన చర్యలు చేపట్టాలి. బలహీనంగా ఉన్న చోట వాటిని పటిష్టం చేయాలి. ఈ విధంగా బుడమేరు ఊళ్ళ మీద పడడానికి గండి కొట్టడమే కారణం. మూడు ప్రధాన భాగానలో గండి పడింది. ఈ గండ్లను పూడ్చడానికి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పూర్తి బాధ్యత తీసుకున్నారు.

ఆయన ఏకంగా ఆరు రోజుల పాటు దివారాత్రులు కష్టపడ్డారు. మొదటి రెండు గండ్లను పూడ్చడం మామూలుగా సాగినా మూడవ గండిని పూడ్చడం మాత్రం కష్టతరం అయింది. ఏకంగా ఆర్మీ కూడా రంగంలోకి దిగాల్సి వచ్చింది. దాంతో చాలా శ్రమకు ఓర్చి మరీ మూడవ గండిని శనివారం నాటికి విజయవంతంగా పూడ్చివేశారు.

దీంతో బుడమేరు వరద పారినా విజయవాడ వైపు చూసే అవకాశం అయితే లేదు. ఆ విధంగా విజయవాడ వాసులు గుండె మీద చేయి వేసుకుని హాయిగా ఉండేలా టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక పటిష్టమైన చర్యను తీసుకుంది. ఈ విషయంలో మంత్రి నిమ్మలని మెచ్చుకుని తీరాల్సిందే.

ఆయన ఆరు రోజుల పాటు బుడమేరు గట్ల మీదనే ఉండి పని పూర్తి చేయించారు. గండి పూడ్చేంతవరకూ తాను అక్కడ నుంచి కదలి రాను అని ఆయన ఒట్టేసి మరీ అక్కడే గడిపారు. ఒక విధంగా పనిమంతుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారు

ఇదంతా ఆయన యుద్ధ ప్రాతిపదికన చేయడం విశేషం. నిజానికి వరదల సమయంలో ఇలాంటి యాక్షన్ ప్లాన్ వెంటనే అమలు చేయలేరు. కానీ విజయవాడ వరదల బీభత్సం చూసి ప్రభుత్వం బుడమేరుకు అడ్డు కట్ట వేయాల్సిందే అని పట్టుదలగా వ్యవహరించింది.

దాంతో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ధీటుగా నిలబడి బుడమేరుకు మూతి బిగించేశారు. ఈ విషయంలో నిమ్మలకు ప్రశంసలు కురుస్తున్నాయి. బుడమేరు మూడవ గండి పూడ్చే కార్యక్రమం తీరు తెన్నులను పరిశీలించేందుకు అక్కడకి వచ్చిన మంత్రి నారా లోకేష్ సైతం నిమ్మలను శభాష్ అని మెచ్చుకున్నారు.

అంతే కాదు ఆయన వీపు తట్టి మరీ అభినందించారు. బుడమేరు కట్ట మీదనే మకాం వేసి మరీ మంత్రి పడిన శ్రమ మాత్రం నిజంగా మెచ్చతగినదే. ఇటీవల కాలంలో దేశంలో చాలా మంత్రుల పనితీరు నిబద్ధత గురించి చర్చ జరుగుతున్న నేపధ్యంలో నిమ్మల మాత్రం తన చిత్తశుద్ధిని చాటుకున్నారు అనే చెప్పాలి.

నిమ్మల చేసిన ఈ పని వల్ల బెజవాడలో లక్షలాది మందికి భద్రత ఏర్పడింది. జోరుగా వానలు మరో వైపు ఈదురు గాలులు వీస్తున్నా బుడమేరు గట్టు మీదనే నిలబడి తడుస్తూ కూడా నిమ్మల చేయించిన ఈ పనుల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వానికి సైతం మంచి పేరు వచ్చింది. పూర్వాశ్రమంలో లెక్చరర్ గా పనిచేసిన నిమ్మల బుడమేరు ఆగడాలకు సరైన అడ్డుకట్ట వేసి గట్టి పాఠం చెప్పారు అని అంటున్నారు. మంత్రిగా ఆయన సబ్జెక్ట్ మీద అవగాహనతో ఉండడమే కాదు సమయం వస్తే ఎందాకైనా వెళ్తాను అని తాజా ఘటనలతో నిరూపించుకున్నారు అని అంటున్నారు.

చంద్రబాబు మంత్రులకు వేసే మార్కులలో నిమ్మల మాస్టారు టాప్ ర్యాంకర్ అవుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి బాబుకు సరైన సచివుడు దొరికారు అని అంతా అంటున్నాబు. బాబు కూడా ఎక్కడా ఒళ్ళు దాచుకోకుండా కష్టపడతారు. అలాంటి ఆయనకు నిమ్మల వంటి మంత్రులు టీం గా కూడితే అద్భుతంగా ప్రభుత్వం పనిచేస్తుందని అంటున్నారు అంతా. ఎనీ హౌ శభాష్ నిమ్మల అని అంతా అనాల్సిందే.

Tags:    

Similar News