నా దగ్గర డబ్బు లేదు.. ఆ మొత్తం ఇవ్వలేను! ప్రభుత్వానికి ఆర్జీవీ రిప్లై?
RGV Reply To AP Govt
ఏపీ ఫైబర్ నెట్ నోటీసులకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాలవర్మ ఊహించని సమాధానమిచ్చాడు. ఫైబర్ నెట్ సంస్థ నుంచి తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించాలని డిసెంబర్ నెలలో ఆర్జీవీకి నోటీసులివ్వగా, తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, తాను తిరిగి చెల్లించలేనని ఆయన సమాధానమిచ్చినట్లు ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. ఆర్జీవీ నుంచి ఊహించని సమాధానం రావడంతో ఆయనపై నెక్ట్స్ ఎలాంటి చర్యలు తీసుకోనున్నారనేది ఉత్కంఠగా మారింది.
గత ప్రభుత్వానికి బాగా సన్నిహితంగా మెలిగిన దర్శకుడు రామ్ గోపాలవర్మ వ్యూహం సినిమాను చిత్రీకరించాడు. దీనిని ఏపీ ఫైబర్ నెట్ ద్వారా స్ట్రీమింగ్ చేయించాడు. పే ఫర్ వ్యూ విధానంలో ఈ సినిమాను ఫైబర్ నెట్ లో ప్రసారం చేయగా కేవలం 1,863 వ్యూస్ మాత్రమే వచ్చాయి. కానీ, రామగోపాలవర్మకు ప్రభుత్వం రూ.2.15 కోట్లు చెల్లించింది. నిబంధనల ప్రకారం ఆయనకు అంత మొత్తం చెల్లించే వీలు లేకపోవడంతో రికవరీ చేయాలని సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి అధికారులను గతంలో ఆదేశించారు. దీంతో 2024 డిసెంబరులోనే రూ.1.15 కోట్లు తిరిగి చెల్లించాలని ఆర్జీవీకి నోటీసులు జారీ అయ్యాయి.
ఫైబర్ నెట్ నోటీసులకు తాజాగా ఆర్జీవీ స్పందించారు. తన వద్ద డబ్బు లేదని ఆ మొత్తం చెల్లించలేనని ఫైబర్ నెట్ సంస్థకు లేఖ రాసినట్లు చైర్మన్ జీవీ రెడ్డి వెల్లడించారు. ప్రజాధనాన్ని అక్రమంగా తీసుకున్న ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జీవీ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.