వైసీపీలో ఉన్నపుడు చిన్నది...బీజేపీలోకి పోతే పెద్దదా !
ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే తన ఉద్యమాల కంటే ఎంపీ పదవి చాలా చిన్నది అని. తనది యాభై ఏళ్ళ బీసీల ఉద్యమమని ఈ మొత్తం పోరాటంలో తనకు ఎంపీ పదవి అంటే చాలా చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు.
అవును మరి. రాజకీయ నేతల మాటలకు అర్ధాలు వేరులే అని అంటూంటారు. కానీ దశాబ్దాలుగా సామాజిక ఉద్యమాలలో ఉంటూ సగటు జనం మద్దతు మన్నన చూరగొన్న ఆర్ క్రిష్ణయ్య వంటి వారు మాట్లాడే మాటలకు కూడా అర్థాలు వెతుక్కోవాలా అంటేనే కాస్తా ఇబ్బందిగా ఉంటుంది.
ఆయన పొలిటీషియన్ గా జనంలోకి రాలేదు. సామాజిక ఉద్యమకారుడిగా వచ్చారు. బీసీలకు బంధువుగా పెద్ద దిక్కుగా ఉంటూ ఉద్యమాలు చేశారు. అటువంటి క్రిష్ణయ్యకు రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు రావడం సహజం. అయితే ఆయన వచ్చిన వాటిని స్వీకరించవచ్చు. తన సిద్ధాంతాలకు ముఖ్యంగా బీసీల అభ్యున్నతి కోసం పాటు పడే పార్టీలలో చేరి మరింతగా సేవ చేయవచ్చు.
కానీ ఆర్ క్రిష్ణయ్య పదేళ్ళ రాజకీయ ట్రాక్ రికార్డు చూస్తే మూడు పార్టీలు మారిపోయారు. కేవలం దశాబ్ద కాలంలోనే ఆయన పార్టీలు మార్చిన చరిత్రను వెంట తెచ్చుకున్నారు. ఆయన కాలు పెట్టిన ప్రతీ పార్టీ గౌరవించి పదవులు ఇచ్చింది. అయినా సరే ఆయన ఆయా పార్టీలను ఎందుకు వీడారో చెప్పేందుకు సహేతుకమైన కారణాలు లేవు.
ఆయన మొదటగా చేరింది టీడీపీలో. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యే టికెట్ అందుకుని పోటీ చేశారు. ఆయనను ఆనాడు బీసీ సీఎం అభ్యర్థిగా పార్టీ ప్రొజెక్ట్ చేస్తూ ప్రచారం చేసింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. క్రిష్ణయ్య ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎందుకో ఆయన తనకు రాజకీయంగా తొలి చాన్స్ ఇచ్చిన టీడీపీని వదిలేశారు.
ఆ తరువాత తెలంగాణాకు చెందిన ఆయనను ఏపీకి తెచ్చి వైసీపీ అధినేత జగన్ రాజ్యసభకు పంపారు. ఆయన కంటే పెద్ద బీసీ ఏపీలో లేరు అని అనుకున్నారా అంటే జవాబు లేదు కానీ క్రిష్ణయ్య అంటే గౌరవం ఆయన ఉద్యమాల పట్ల ఉన్న అభిమానం తోనే ఇలా చేశారు జగన్ అని చెప్పుకున్నారు. అలా రెండేళ్ళ పాటు పెద్దల సభ అయిన రాజ్యసభలో వైసీపీ ఎంపీగా వెలిగిన క్రిష్ణయ్య సడెన్ గా ఈ ఏడాది సెప్టెంబర్ లో తన పదవికి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా ఆయన అన్న మాటలు చూస్తే తన ఉద్యమాల కంటే ఎంపీ పదవి చాలా చిన్నది అని. తనది యాభై ఏళ్ళ బీసీల ఉద్యమమని ఈ మొత్తం పోరాటంలో తనకు ఎంపీ పదవి అంటే చాలా చిన్న విషయం అన్నట్లుగా మాట్లాడారు. పైగా తాను ఇక మీదట బీసీల కోసమే పనిచేయడానికి ఎంపీ పదవిని వదులుకున్నాను అని చెప్పారు.
ఎంపీగా ఉండడం కంటే జనంలో ఉంటూ పోరాటాలు చేయడమే తనకు ఇష్టమని కూడా ఆయన అన్నారు. ఇలా ఎంతో ఉదాత్తమైన భావాలతో తాను ఎంపీ పదవిని వదిలేశాను అని ఆయన అన్నపుడు చాలా మంది క్రిష్ణయ్య డెసిషన్ ని మెచ్చుకున్నారు. ఈ రోజులలో కూడా పదవుల మీద ఆశ పడకుండా ఇలా ఉండడం సాధ్యమేనా అని కూడా భావించారు.
కట్ చేస్తే బీజేపీ నుంచి ఏపీ కోటాలో రాజ్యసభకు క్రిష్ణయ్యని ఎంపిక చేశారు. దాంతోనే క్రిష్ణయ్య రాజకీయం మీద ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఈయన కూడా అందరి లాంటి ఫక్తు రాజకీయ నాయకుడేనా అన్న భావన కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బీసీ క్రిష్ణయ్య అన్న పేరు కంటే బీజేపీ కృష్ణయ్య అన్న పేరు చాలా చిన్నది అన్న దానిని ఆయన ఎందుకు తెలుసుకోలేకపోయారు అని అంటున్నారు. ఎటువంటి వెన్నుదన్ను లేకుండా తన సొంత పోరాట పటిమతో క్రిష్ణయ్య బీసీ ఉద్యమ నేతగా జాతీయ స్థాయిదాకా ఎదిగారు. అటువంటి ఆయన సామాజిక ఉద్యమకారుడిగానే ఉంటే ఆయన కీర్తి ఎక్కడో ఉండేది.
కానీ రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చినదే చాలు అన్నట్లుగా వరసగా పార్టీలు మారుస్తూ పోతున్నారు. ఇపుడు చూస్తే బీజేపీ కండువా కప్పుకున్నారు. దీనిని చూసిన వారు ఆయన అధికార పార్టీకి దగ్గరగా ఉంటూనే రాజకీయాలు చేస్తారా అన్న విమర్శలు చేస్తున్నారు.
టీడీపీ 2014లో ఓడగానే ఆ పార్టీకి దూరం జరిగారు. 2024లో వైసీపీ ఓటమి పాలు కాగానే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. రేపటి రోజున బీజేపీకి కష్టకాలం ఎదురైతే క్రిష్ణయ్య మళ్లీ కండువా మారుస్తారా అన్న చర్చ కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా సామాజిక ఉద్యమకారుడిగా మంచి పేరున్న క్రిష్ణయ్య రాజకీయాల్లోకి వచ్చి ఆ అవలక్షణాలను తానూ ఒంటబట్టించుకుంటున్నారా అన్న ప్రశ్నలు అయితే అందరిలోనూ వస్తున్నాయి.
కేవలం వైసీపీ ఎంపీ పదవి వల్ల తన స్థాయి తగ్గిని గతంలో ప్రకటించిన క్రిష్ణయ్యకు ఇపుడు బీజేపీ ఎంపీ కాగానే స్థాయి పెరుగుతుందా అన్న ప్రశ్నలకు సహేతుకంగా ఆయనే జవాబు చెబితే మచిదేమో అని అంటున్నారు.