రుణమాఫీ అమలు... రాజీనామాపై హరీష్ మాట మార్చలేదా?
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో... హరీష్ రావు – రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన సవాళ్ల మేటర్ చర్చకు వచ్చింది.
తెలంగాణ రాజకీయాల్లో రైతు రుణమాఫీ పథకం ఎంత హాట్ టాపిక్ అనేది తెలిసిన విషయమే. గతంలో బీఆరెస్స్ అధికారంలో ఉన్న సమయంలో రైతు బంధు పథకం అమలులో ఉండేది. అయితే... దానిపై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అసలైన అర్హుల విషయంలో అజాగ్రత్తలు అనే మాటలు వినిపించాయి. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ హామీని ఇచ్చింది. తాజాగా అమలు మొదలుపెట్టింది.. దీంతో హరీష్ రావు టాపిక్ తెరపైకి వచ్చింది.
అవును... గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ డిక్లరేషన్ లో భాగంగా... రైతులందరికీ రూ.2 లక్షలు రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అనంతరం... ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ హామీ ఎప్పుడు నెరవేరుతుందా అనే చర్చ జరిగింది. దీంతో.. ఆగస్ట్ 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు.
అన్నట్లుగానే గురువారం (జూలై 18న) రైతు రుణమాఫీ పథకాన్ని రేవంత్ ప్రారంభించారు. ఇందులో భాగంగా... మొదటి విడతలో భాగంగా రూ. లక్ష లోపు ఉన్న రుణాలను మాఫీ చేయడం కోసం రూ.6,098 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీనివల్ల 11.5 లక్షల మంది రైతులకు ఏక కాలంలో లబ్ధి కలగనుందని అంటున్నారు. ఇక రెండో విడతలో భాగంగా రూ. లక్షన్నర రుణమఫీని ఈ నేలాఖరులోగా చేయనున్నారు.
ఇదే క్రమంలో... ఆగస్టు నెల దాటక ముందే రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయనున్నారని తెలుస్తోంది. ఈ విధంగా మూడు విడతల్లోనూ రైతు రుణమాఫీ కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ.31 వేల కోట్లను ఖర్చు చేయనుంది! దీంతో తెలంగాణ రైతాంగం హర్షం వ్యక్తం చేస్తుంది. ఈ సమయంలో... బీఆరెస్స్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు టాపిక్ తెరపైకి వచ్చింది.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో... హరీష్ రావు – రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన సవాళ్ల మేటర్ చర్చకు వచ్చింది. ఇందులో భాగంగా... లోక్ సభ ఎన్నికల ప్రచార సమయంలో... రైతు రుణమాఫీ హామీని ఆగస్టు 15లోగా అమలుచేసి తీరతామని రేవంత్ రెడ్డి సవాల్ విసరగా.. ఒక వేళ ఒకేసారి రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ హరీష్ రావు ప్రతి సవాల్ విసిరారు!
దీంతో... హరీష్ రావుని తగులుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇందులో భాగంగా... ఇచ్చిన హామీ మేరకు ఆగస్టు 15లోపు రుణమాఫీ అమలవుతోందని.. మరి రాజీనామా సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే... తాను కేవలం రుణమాఫీ అమలు చేసినంత మాత్రాన్న రాజీనామా చేస్తానని చెప్పలేదని.. దానితోపాటు ఆరు గ్యారెంటీలు, 13 హామీలను 100 రోజుల్లో అమలు చేస్తే రాజీనామా చేస్తామని చెప్పినట్లు స్పష్టం చేశారు.
అవసరమైతే... అప్పుడు తాను ఇచ్చిన స్టేట్ మెంట్ కి సంబంధించిన వీడియోలు మరోసారి చెక్ చేసుకోవాలని హరీష్ రావు సూచించారు. తాను చేసిన సవాలుకు ఇప్పటికీ కట్టుబడే ఉన్ననని ఆయన తెలిపారు. ఇప్పటికీ ఆగస్ట్ 15లోపు రూ.2 లక్షల రుణమాఫీని పూర్తి చేయటంతోపాటు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్లు రాసిచ్చిన 13 హామీలను అమలు చేయాలని.. అలా చేస్తే రాజీనామాకు సిద్ధమని హరీష్ రావు పునరుధ్ఘాటించారు.