ఓవైపు యుద్ధం.. మరోవైపు చంద్రుడిపైకి సిద్ధం.. అదీ రష్యా అంటే

ఒకప్పుడు అమెరికాతో ఢీ అంటే ఢీ.. అమెరికా కంటే ఓ మెట్టు పైనే అన్నంత పేరు

Update: 2023-08-11 08:18 GMT

ఒకప్పుడు అమెరికాతో ఢీ అంటే ఢీ.. అమెరికా కంటే ఓ మెట్టు పైనే అన్నంత పేరు. కానీ, కాలక్రమంలో వెనుకబడిపోయింది.. విచ్ఛిన్నమైపోయింది. రెండు దశాబ్దాల నుంచి పుంజుకుంటోంది.. ఇదంతా రష్యా గురించి. సోవియట్ యూనియన్ గా ఉన్నప్పుడే చంద్రుడిని ముద్దాడింది ఆ దేశం. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు చలో చందమామ అంటూ రాకెట్ ప్రయోగం చేపట్టింది. అందులోనూ మరో విశేషం ఏమంటే.. ఇటీవల మన ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3లో టార్గెట్ అయిన దక్షిణ ధ్రువం పైనే రష్యా  గురి పెట్టింది.

పేరు లూనానే.. కానీ మహా వేగంగా..

సాధారణంగా మనం వినియోగించే వాహనాల్లో అతి తక్కువ వేగంతో వెళ్లేది లూనా. కానీ, రష్యా 'లూనా-25' పేరుతో ప్రయోగించిన రాకెట్ మహా వేగవంతమైనది. ఎంత అంటే.. 20 రోజుల కిందట ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే ముందే లక్ష్యాన్ని చేరుకోనుంది. కాగా, రష్యా రాజధాని మాస్కోకు తూర్పున 3,450 మైళ్ల దూరంలోని వోస్తోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి శుక్రవారం వేకువజామున 2.10 గంటలకు 'లూనా - 25'ను ప్రయోగించారు. రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌ కాస్మోస్‌ ఆ మేరకు ఫొటోలు విడుదల చేసింది.

5 రోజుల్లోనే.. చంద్రుడి కక్ష్యలోకి

లూనా -25 కేవలం 5 రోజుల్లోనే చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. అనంతరం దక్షిణ ధ్రువంలో 3 లేదా 7 రోజుల్లో ల్యాండర్‌ దిగనుంది. అంటే ఈ నెల 21న చంద్రుడిపై అడుగుపెడుతుంది. అయితే, ఈ ల్యాండర్ ఏడాది పాటు అక్కడే ఉంటూ పరిశోధనలు చేస్తుంది. చంద్రయాన్‌ -2 ఆర్బిటర్ కక్ష్యలోనే ఉంది. చంద్రయాన్‌ -3కి కూడా దీనినే వినియోగిస్తున్నారు. చంద్రయాన్‌ -3 పంపే ల్యాండర్‌ జాబిల్లిపై 14 రోజులు పరిశోధనలు చేస్తుంది. రష్యా చివరిగా 1976 తర్వాత లూనార్‌ ల్యాండర్‌ ప్రయోగం చేపట్టడం విశేషం.

చంద్రయాన్ 3 కంటే ముందే

భూమిపై భారత్ -రష్యా మంచి మిత్రులు. కానీ చంద్రుడిపై ప్రత్యర్థులుగా మారనున్నాయి. 'చంద్రయాన్ -3' ద్వారా ఏ దేశ అంతరిక్ష నౌక కూడా చేరుకోని విధంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగాలని చూస్తున్న భారత్ కు 'లూనా-25'తో రష్యా పోటీ ఇస్తోంది. అంతేకాదు.. చంద్రయాన్ -3 జాబిల్లి దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23న దిగనుండగా, దీనికిముందే రష్యా లూనా-25 అక్కడే అడుగుపెట్టే అవకాశాలున్నాయి.

తేడా ఏమింటంటే.. ఢీకొంటాయా?

లూనా-25 కేవలం ల్యాండర్ మిషన్‌ మాత్రమే. 30 కేజీల పేలోడ్‌ తీసుకెళ్తోంది. చంద్రుడిపై మట్టి ఆనవాళ్లను సేకరించేందుకు అవసరమయ్యే రోబోటిక్ చేతులు, డ్రిల్లింగ్, ఇతర శాస్త్రీయ పరికరాలు ఉన్నాయి. కాగా, చంద్రయాన్‌ -3లో ల్యాండర్‌, రోవర్‌ ప్రొపల్షన్ అనే మాడ్యూల్స్ ఉన్నాయి. చందమామ జాబిల్లి దక్షిణ ధ్రువంలో భారీగా మంచు ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అక్కడ ల్యాండింగ్ సవ్యంగా జరిగితే ఆక్సిజన్‌, ఇంధనం, నీటి గురించిన సమాచారం సేకరించే అవకాశం లభిస్తుంది. ఈ క్రమంలోనే దక్షిణ ధ్రువంపై ఆగస్టు 23 కంటే ముందే లూనా-25 ల్యాండర్ దిగితే అక్కడ అడుగిడిన తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్ -3, లూనా-25 టార్గెట్ దక్షిణ ధ్రువమే. మరి ల్యాండింగ్ సందర్భంగా ఢీ కొనే ప్రమాదం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అలాంటిదేమీ జరగదని.. ల్యాండింగ్ కు ఎంచుకున్న ప్రాంతాలు వేర్వేరని రష్యా స్పష్టతనిచ్చింది.

ఇస్రో అభినందనలు

లూనా-25ని విజయవంతంగా ప్రయోగించడంపై రష్యా అంతరిక్ష పరిశోధనా సంస్థ రోస్‌కాస్మోస్‌కు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అభినందనలు తెలియజేసింది. ''ఈ అంతరిక్ష ప్రయాణంలో మనకు మరో మీటింగ్‌ పాయింట్‌ ఉండటం అద్భుతం'' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది. చంద్రయాన్‌-3, లూనా-25 మిషన్లు తమ లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించింది.

Tags:    

Similar News