సబితకు కష్టమేనా.. ఆ వర్గం దూరమేనా?
అయితే తొలిసారి బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో దిగిన సబితాకు ఇబ్బందులు తప్పేలా లేవనే చెప్పాలి. ప్రస్తుతం అధికార పార్టీ బీఆర్ఎస్ అండ ఆమెకు ఉంది.
ఆ మహిళా నేతకు రాజకీయాల్లో తిరుగులేదు. ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి విజయాలు సాధించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో సాగిన ఆ మహిళా సీనియర్ నేత దేశంలోనే తొలిసారి ఓ రాష్ట్రానికి మహిళా హోం మంత్రిగా చరిత్ర నమోదు చేశారు. అలాంటి ఆ నాయకురాలికి ఈ సారి ఎన్నికల్లో కఠిన పరిస్థితులు తప్పేలా లేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెంటిమెంట్ ఆమెను దెబ్బకొట్టేలా ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆ మహిళా నేత ఎవరో కాదు సబితా ఇంద్రారెడ్డి.
తన భర్త, మాజీ మంత్రి ఇంద్రారెడ్డి మరణంతో 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి సబితా విజయం సాధించారు. 2004లోనూ అక్కడి నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు. కానీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్లను ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో 2009లో మహేశ్వరం నుంచి పోటీ చేసి సబితా నెగ్గారు.
అప్పుడు వైఎస్ మంత్రి వర్గంలో హోం మంత్రిగా పనిచేశారు. కానీ కుటుంబంలో ఒకరికే సీటు అని చెప్పడంతో కొడుకు కార్తీక్ రెడ్డి కోసం 2014లో పోటీకి సబితా దూరంగా ఉన్నారు. తిరిగి 2018 ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేసి మళ్లీ సబితా గెలిచారు. అనంతరం బీఆర్ఎస్ లో చేరిపోయారు.
అయితే తొలిసారి బీఆర్ఎస్ నుంచి ఎన్నికల బరిలో దిగిన సబితాకు ఇబ్బందులు తప్పేలా లేవనే చెప్పాలి. ప్రస్తుతం అధికార పార్టీ బీఆర్ఎస్ అండ ఆమెకు ఉంది. కానీ గతంలో గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల బలం, సెంటిమెంట్ మాత్రం ఆమెకు దూరమయ్యాయి.
తన భర్త ఇంద్రారెడ్డి చేసిన త్యాగాలు, పనిని చెప్పుకుంటూ గతంలో విజయాలు సాధించారు. అంతే కాకుండా బలమైన కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆమెతో ఉండేది. కానీ ఇప్పుడు ఆ కాంగ్రెస్ బలం లేదు. మరోవైపు సెంటిమెంటు కూడా వర్కవుట్ అయ్యేలా లేదనే అభిప్రాయాలున్నాయి. ముఖ్యంగా ఆమెపై సానుభూతి, సానుకూలత గతంలో ఉన్నంతగా లేవనే చెప్పాలి. మరి ఈ సారి సవాలును దాటి సబిత మరోసారి విజయం సాధిస్తారేమో చూడాలి.