అదే జరిగితే మా దేశం మరో పాకిస్థాన్.. హసీనా కుమారుడి ఆందోళన

బంగ్లాదేశ్ 1971లో స్వాతంత్ర్యం పొందింది. 1975 వరకు హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ అధ్యక్షుడు, ప్రధానిగా ఉన్నారు.

Update: 2024-08-06 14:30 GMT

పాకిస్థాన్ నుంచే పుట్టిన బంగ్లాదేశ్ పాకిస్థాన్ లాగానే మారనుందా..? రాజకీయాల్లో ఆర్థికంగా సామాజికంగా ఒకటే తరహా అయిన ఈ రెండు దేశాలు మొదట్లో ఒకే విధమైన పాలనలో సాగాయి.. కానీ, షేక్ హసీనా వచ్చాక బంగ్లా రాత మారింది. పలు రంగాల్లో ముందంజ వేసింది. మెరుగైన తలసరి ఆదాయం ఉన్న దేశంగా ఎదిగింది. జీడీపీలో అయితే భారత్ నే దాటేసింది. అలాంటి బంగ్లా ఇప్పుడు తీవ్ర రాజకీయ సంక్షోభంలో ఉంది. సైనిక పాలనలోకి వెళ్లింది.

బంగ్లాదేశ్ 1971లో స్వాతంత్ర్యం పొందింది. 1975 వరకు హసీనా తండ్రి ముజిబుర్ రెహ్మాన్ అధ్యక్షుడు, ప్రధానిగా ఉన్నారు. ఆయనను మిలటరీ దారుణంగా చంపేసి అధికారం చేపట్టింది. అప్పటినుంచి 1991 వరకు సైనిక పాలనే. ఆ తర్వాత హసీనా, ఖలీదా జియాలు రంగంలోకి రావడంతో ప్రజాస్వామ్యం వర్ధిలింది. కానీ, మళ్లీ ఇప్పుడు భవితవ్యం గందరగోళంలో పడింది. హసీనా పరారు కావడంతో సైనిక జనరల్ పగ్గాలు చేపట్టాడు. కాగా, హసీనా కుమారుడు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిపుణుడు, ఇదే రంగంలో తల్లికి సలహాదారుగా వ్యవహరించిన సాజీబ్ వాజెద్ జాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేవాడు. తీవ్రమైన బాధాతప్త హృదయంతో తన తల్లి సొంత దేశాన్ని వీడిపోయారని చెప్పుకొచ్చాడు. వాజెడ్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. బంగ్లాలోని తాజా పరిస్థితులపై భారత్‌ లోని వివిధ మీడియా సంస్థలతో మాట్లాడారు.

ఎన్నికవని పార్టీని అధికారం చేపట్టనీయొద్దు

బంగ్లాలో ప్రజాస్వామ్యం నెలకొనాలని.. ఎన్నికల్లో గెలవని పార్టీని అధికారంలోకి రానీయొద్దని కోరారు. ఈ మేరకు సైన్యం, పోలీసులు, బంగ్లా సరిహద్దు బలగాలు ప్రజలకు భద్రతను కల్పించాలని కోరారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించవద్దని.. ఇక అలా చేస్తే బంగ్లాదేశ్‌ పరిస్థితి పాకిస్థాన్‌ అవుతందని వాపోయారు. తమ దేశం ఎప్పటికీ కోలుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంతా నీరుగారిపోతుందని వాపోయారు. కాగా, తాజా అల్లర్లలో పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ హస్తం ఉందనే అనుమానాన్ని కూడా వాజెద్ వ్యక్తం చేయడం గమనార్హం. అమ్మ హసీనా తిరిగి రాజకీయాల్లోకి రాబోరని ఇప్పటికే ఆయన స్పష్టం చేశారు.

పరిస్థితులు ఎంత చేజారినా హసీనా దేశాన్ని వీడాలనుకోలేదని సాజీబ్‌ చెప్పారు. భద్రతా కారణాల రీత్యానే తమ ఒత్తిడితో దేశం వీడారని చెప్పారు. బంగ్లాను అభివృద్ధి చెందిన దేశంగా చూడడం హసీనా కలగా తెలిపారు. చివరకు ఇలా జరగడాన్ని తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇకమీదట తమ దేశంలో నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికలు జరుగుతాయని అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ఏం జరిగినా అది తమ కుటుంబ బాధ్యత కాదని తేల్చిచెప్పారు. లండన్‌ లో ఉండాలని హసీనా కోరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు.

Tags:    

Similar News