బీజేపీ అభ్యర్థులంతా చంద్రబాబు మనుషులే: సజ్జల
బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కూడా చంద్రబాబు నిర్ణయించారని సజ్జల ఆరోపించారు.
ఏపీలో త్వరలో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనలు పొత్తు పెట్టుకుని కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ తరఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని 10 శాసనసభ స్థానాలకు గాను బరిలో దిగుతున్న క్యాండిడేట్ల వివరాలను బిజెపి వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ జాబితా పై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
బీజేపీ తరఫున పోటీ చేయబోతున్న అభ్యర్థుల జాబితాను కూడా చంద్రబాబు నిర్ణయించారని సజ్జల ఆరోపించారు. బీజేపీలోని తన మనుషులకు టికెట్లు ఇప్పించి చంద్రబాబు పావులు కదిపారని సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీలో ఉన్నది టీడీపీ ఏజెంట్లేనని కథనాలు వస్తున్నాయని సజ్జల ఆరోపించారు.3 కోట్లు ఇస్తే సీటు వదిలేస్తానని టీడీపీ నేతకు ఓ బీజేపీ నేత ఆఫర్ ఇచ్చినట్టు ఆడియో లీక్ అయిందని గుర్తు చేశారు.
ఇక, జనసేన అభ్యర్థుల జాబితానూ చంద్రబాబు తన మనుషులతో నింపేశారని ఆరోపించారు. ఇదంతా చంద్రబాబు ఆడుతున్న నాటకం అని సజ్జల ఎద్దేవా చేశారు. నకిలీ నోటు వంటి చంద్రబాబు రూ.4 వేల పెన్షన్ ఇస్తానంటే ఎవరూ నమ్మరని చురకలంటించారు. చంద్రబాబు చెప్పేవి జరగవని, పొరపాటున ఆయన అధికారంలోకి వస్తే జగన్ ఇస్తున్న పథకాలు ఆపేస్తాడని ప్రజలకు బాగా తెలుసని అన్నారు.