కాంగ్రెస్ టార్గెట్... కమ్యూనిస్టులతో జట్టు ?

ఏపీలో వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోంది అని అంటున్నారు. ఇటీవల జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ 2.0 అని కొత్త అవతార్ కొత్త లెక్క అని గట్టిగా చెప్పారు

Update: 2025-02-07 21:30 GMT

ఏపీలో వైసీపీ కొత్త రాజకీయ వ్యూహాలను రూపొందిస్తోంది అని అంటున్నారు. ఇటీవల జగన్ పార్టీ నేతలతో మాట్లాడుతూ 2.0 అని కొత్త అవతార్ కొత్త లెక్క అని గట్టిగా చెప్పారు. దాంతో ఏపీలో వైసీపీ గేర్ మార్చడానికి రెడీ అవుతోంది అంటున్నారు.

వైసీపీ విషయానికి వస్తే గత ఎనిమిది నెలలుగా చూస్తే అన్నీ జంపింగులే తప్ప పార్టీలో ఉండేదేవరు అన్న చర్చ సాగుతోంది. దీంతో క్యాడర్ కి కూడా విశ్వాసం సన్నగిల్లుతోంది అని అంటున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినాయకత్వం దూకుడు పెంచింది అని అంటున్నారు.

పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు. అందుకే చేరికలను ప్రోత్సహిస్తున్నారు. వైసీపీలో ఇప్పటికిప్పుడు కూటమి నుంచి ఎవరూ చేరేది ఉండదు, వారంతా అధికార పార్టీలో ఉన్నారు. పైగా వైసీపీ నుంచే అక్కడికి వెళ్తున్నారు. దాంతో పార్టీకి బూస్టప్ ఇవ్వడానికి వైసీపీ హైకమాండ్ కొత్త ఆలోచనలు చేస్తోంది.

కాంగ్రెస్ నుంచి భారీ ఎత్తున చేరికలను ప్రోత్సహిస్తోంది. గతంలో చేరాలని ఆసక్తి చూపిన నేతలను సైతం పెద్దగా పట్టించుకోని పార్టీ ఇపుడు మాత్రం వారిని కోరి మరీ కండువాలు కప్పుతూ సమాదరిస్తోంది. ఇదంతా రాజకీయ వ్యూహంలో భాగమే అని అంటున్నారు.

ఏపీలో కాంగ్రెస్ ఒట్టిపోయి చాలా కాలం అయింది. కానీ ఆ పార్టీ మీద అభిమానంతో ఉన్న వారు చాలా మంది సీనియర్లు ఉన్నారు. మూడు ఎన్నికలు వరసగా కాంగ్రెస్ దారుణ ఓటములు చూశాక వారిలో కూడా వైరాగ్య భావనలు ఆవరిస్తున్నాయి అంటున్నారు. దాంతో వారిని పిలిచి మరీ పెద్ద పీట వేయడానికి వైసీపీ చూస్తోంది. ఈ మేరకు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సాకె శైలజానాధ్ పార్టీ తీర్ధం తీసుకున్నారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ పేర్లు చెప్పను కానీ చాలా మంది వస్తారని వైసీపీలో చేరుతారని కూడా హింట్ ఇచ్చారు. మరి కాంగ్రెస్ లో సీనియర్లు ఉన్న వివిధ జిల్లాలోని కీలక నేతలు ఇపుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని అంటున్నారు. వైసీపీ సైతం వ్యూహాత్మకంగా వెళ్తోంది. కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేతలను తీసుకుని వైసీపీ బలపడాలని చూస్తోంది.

సహజంగా రెండు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ ఒక్కటే కాబట్టి నేతలు అటు నుంచి ఇటు వస్తారని భావిస్తోంది. అంతే కాదు ఏపీలో కాంగ్రెస్ ఉనికి మరింతగా ప్రశ్నార్ధకం చేస్తే సమీప భవిష్యత్తులో వైసీపీకి సిద్ధాంత పరంగా పోటీ ఉండదని భావిస్తోంది. వైసీపీ బలహీనపడి కాంగ్రెస్ బలపడుతుంది అన్న లెక్కలను తారు మారు చేసేలా ఇపుడు కాంగ్రెస్ ని వైసీపీ టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు.

అదే సమయంలో ఏపీలో ఉభయ వామపక్షాలను కూడా దగ్గరకు తీయడం ద్వారా సమీప భవిష్యత్తులో భారీ ఉద్యమాలను నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. వామపక్షాలకు పెద్ద గొంతుక ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకతను వారు చాలా సులువుగా పెంచగలరు అన్నది ఒక మాట ఉంది. అందువల్ల వారితో పొత్తులు పెట్టుకుంటే రానున్న కాలంలో ఏపీలో బలంగా ఉన్న కూటమికి ఆల్టరేషన్ గా మారాలని చూస్తోంది. వచ్చే ఎన్నికలు డూ ఆర్ డైగా ఉన్న నేపథ్యంలో వైసీపీ 2.0 తో సరికొత్త యాక్షన్ ప్లాన్ కి రెడీ అవుతోంది అని అంటున్నారు.

Tags:    

Similar News