చేసింది మంచిపనే.. కానీ.. టైం మించిపోయింది.. జగన్ సర్!!
తాజాగా ఏపీలోని జగన్ సర్కారు స్పందించింది. సాకే భారతి కుటుంబానికి రెండెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించారు
ఏదైనా పనిని సమయానికి చేయాలి. అప్పుడే ఆ పనికి సార్థకత. సమయం మించిపోయిన తర్వాత.. ఏ పని చేసినా.. గుర్తింపు రావడం కష్టమే. దీనిని ఇప్పుడే కాదు.. కొన్ని దశాబ్దాలుగా నాయకులు అవలంబిస్తున్నారు. అందుకే ఏం జరిగినా.. వెంటనే రియాక్ట్ అవుతున్నారు. ఏపీలో తాజాగా ప్రభుత్వం మంచి పనిచేసింది. ఇంకా చేయాల్సింది ఉన్నా.. ఒక మంచి ఉద్దేశంతో పనిచేసింది. కానీ, ఇది సమయానికి చేయకపోవడంతో దానికి తగిన గుర్తింపు.. ప్రభుత్వానికి కావాల్సిన గ్రాఫ్ పెరగలేదని పరిశీలకులు అంటున్నారు.
విషయం ఏంటంటే..
ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నాగులగుడ్డం గ్రామానికి చెందిన ఎస్సీ మహిళ సాకే భారతి.. గురించి అందరికీ తెలిసిందే. ఆమె అత్యంత పేద కుటుంబానికి చెందిన గృహిణి. ఓ వైపు కూలి పనులు చేసుకుంటూ.. ఇంకోవైపు సంసారాన్ని నెట్టుకొస్తూ.. మరోవైపు రాత్రింబవళ్లు చదువుకుంటూ ఎంతో కష్టపడి పట్టుదలతో పీహెచ్‌డీ పట్టా సాధించింది. అది కూడా అత్యంత కష్టమైన.. క్లిష్టమైన.. రసాయ శాస్త్రంలో పీహెచ్‌డీ కావడం గమనార్హం. ఇదేమంత చిన్న విషయం కాదు.
ఇక, అనంతరంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో కొన్నాళ్ల కిందట జరిగిన కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమెకు పీహెచ్‌డీ పట్టా అందించారు. ఇక, అప్పుడు బయట ప్రపంచానికి సాకే భారతి గురించి , ఆమె పడ్డ కష్టం గురించి తెలిసింది. దీనిని జాతీయ పత్రికలు కూడా ముద్రించాయి. అయితే.. ఇది జరిగి 25 రోజులు అవుతోంది. అయితే.. నిన్నమొన్నటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో సర్కారు.. 'విద్యా భారతి'ని పట్టించుకోలేదంటూ.. విమర్శలు వెల్లువెత్తాయి. నిజమే కదా.. మట్టిలో మాణిక్యాలకు ప్రభుత్వమే అండగా ఉండాలి కదా.. అని నెటిజన్లు కూడా సమర్థించారు.
కట్ చేస్తే..
తాజాగా ఏపీలోని జగన్ సర్కారు స్పందించింది. సాకే భారతి కుటుంబానికి రెండెకరాల భూమిని ప్రభుత్వం కేటాయించారు. దీనికి సంబంధించిన పట్టాను కలెక్టరేట్‌లో సాకే భారతికి కలెక్టర్ గౌతమి అందజేశారు. శింగనమల నియోజకవర్గంలోని సోదనపల్లి గ్రామంలో సాకే భారతికి రెండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించినట్టు కలెక్టర్ తెలిపారు. త్వరలోనే అక్కడ ప్రభుత్వ సొమ్ముతో ఇంటిని నిర్మించి ఇస్తామన్నారు. అయితే.. ఇది వెలుగులోకి రాలేదు. ఎందుకంటే.. అప్పుడే వేడిలో వేడి సర్కారు నిర్ణయం తీసుకుని ఉంటే.. విమర్శించిన గొంతులకు తాళం పడేది కదా! అంటున్నారు వైసీపీ అభిమానులు.