మైనర్ పై అత్యాచారం... స్టార్ క్రికెటర్ కు ఎనిమిదేళ్ల జైలు!
ఐపీఎల్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే గురించి చాలామందికే పరిచయం ఉండి ఉంటుంది
ఐపీఎల్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్, లెగ్ స్పిన్నర్ సందీప్ లామిచానే గురించి చాలామందికే పరిచయం ఉండి ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకొంటున్న నేపాల్ జట్టు సభ్యుడు, 22 సంవత్సరాల సందీప్ లామీచానే... వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు కూడా సృష్టించాడు. ఆ సంగతి అలా ఉంటే... తాజాగా ఇతడికి అత్యాచారం కేసులో ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.
అవును... మైనర్ పై అత్యాచారం కేసులో నేపాల్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సందీప్ లామిచానే కు 8ఏళ్ల జైలు శిక్ష పడింది. 2022 ఆగస్టులో కాఠ్మాండూలోని ఓ హోటల్ లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బాలిక కోర్టును ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం బెయిలుపై విడుదలయ్యాడు.
ఈ క్రమంలో ఈ కేసులో అతడిని గత డిసెంబరులో దోషిగా తేల్చిన కాఠ్మాండూ జిల్లా కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఈ విషయం అటు నేపాల్ తో పాటు క్రికెట్ ప్రపంచంలోనూ హాట్ టాపిక్ గా మారింది.
కాగా... అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకొంటున్న నేపాల్ జట్టు సభ్యుడు సందీప్ లామీచానే... వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. అఫ్ఘనిస్థాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నెలకొల్పిన ప్రపంచ రికార్డును.. ఈ నేపాలీ కుర్రోడు అధిగమించాడు. కేవలం 42 వన్డే మ్యాచ్ ల్లోనే 100 వికెట్లు పడగొట్టడంతో... అత్యంత వేగంగా 100 వన్డే వికెట్లు సాధించిన తొలి బౌలర్ గా సందీప్ నిలిచాడు.
2023 ఏప్రిల్ లో ఏసీసీ పురుషుల ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో సందీప్ ఈ రికార్డు నమోదు చేశాడు. మరో విషయం ఏమిటంటే... సందీప్ ఐపీఎల్ ఆడిన ఏకైక నేపాలీ క్రికెటర్ కూడా. ఇందులో భాగంగా... ఐపీఎల్ లో 2018 నుంచి 2020 సీజన్ వరకూ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాడు.
ఐపీఎల్ సీజన్ కు 15 సంవత్సరాల వయసులోనే 10 లక్షల రూపాయల కాంట్రాక్టుపై ఎంపికైన సందీప్... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఆడాడు. ఈ క్రమంలో ఢిల్లీ తరపున 9 మ్యాచులు ఆడిన సందీప్... 2018 సీజన్లో ఆరు వికెట్లు, 2019లో 13 వికెట్లు పడగొట్టాడు. అనంతరం జరిగిన 2020 సీజన్లో మాత్రం ఢిల్లీ తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.
మొత్తం 51 వన్డేలు ఆడిన సందీప్.. 112 వికెట్లు పడగొట్టాడు. ఇదే క్రమంలో 52 టీ20ల్లో 98 వికెట్లు దక్కించుకున్నాడు. ఈ క్రమంలో తాజాగా మైనర్ పై అత్యాచారం కేసులో ఇతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది.