బెంగాల్ సహా సుప్రీంకోర్టును కుదిపేస్తున్న `సందేశ్ ఖాలీ`... అసలేంటిది?
సందేశ్ ఖాలీ.. అనేది పశ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్తరపరగణాల జిల్లాలో ఉన్న ఓ మారు మూల ప్రాంతం.
గత వారం రోజులుగా దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన పెను సంచలనంగా మారిన వ్యవహారం `సందేశ్ ఖాలీ.` మన దక్షిణాది రాష్ట్రాల్లో ఈ వ్యవహారం పెద్దగా సంచలనం కాలేదు కానీ.. ఉత్తరాది సహా ఢిల్లీ వర్గాలు, సుప్రీంకోర్టులోనూ తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్, బీజేపీల మధ్య నిప్పులు రాజేసింది. అంతేకాదు.. ఒకవైపు మహిళా కమిషన్ చైర్ పర్సన్ సందర్శన... మరోవైపు.. పార్లమెంటు ఎథిక్స్ కమిటీ క్షేత్రస్థాయి పర్యటన.. ఇవన్నీ ఇలా ఉంటే.. సుప్రీంకోర్టులో వరుస కేసులు.. ఇలా మొత్తంగా.. పశ్చిమ బెంగాల్ సహా సుప్రీంకోర్టును ఉత్తరాదిని ఈ సందేశ్ ఖాలీ అంశం పెద్ద ఎత్తున కుదుపునకు గురి చేస్తోంది.
అసలేంటిది?
సందేశ్ ఖాలీ.. అనేది పశ్చిమ బెంగాల్‌లోని 24 ఉత్తరపరగణాల జిల్లాలో ఉన్న ఓ మారు మూల ప్రాంతం. ఇక్కడ పెను వివాదం రాజుకుంది. అధికార పార్టీ తృణమూల్‌కు చెందిన కీలక నేత షాజహాన్ షేక్ అనుచరులు.. తమ భూములను బలవంతంగా కబ్జా చేశారని, దీనిని ప్రశ్నించిన తమపై.. లైంగిక దాడులు చేశారని, ఒకరిద్దరిద్దరిపై అత్యాచారం కూడా చేశారని.. ఇక్కడి మహిళలు ఆరోపించారు. ఈ వ్యవహారం... గత వారం వెలుగు చూసింది. ఈ విషయం రాష్ట్రంలో ప్రచారంలోకి రావడంతో ప్రతిపక్ష బీజేపీ దీనిని సీరియస్‌గా తీసుకుంది. వెంటనే రాష్ట్ర బీజేపీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు సుకాంత మజుందార్.. ఘటనా ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో ఇటు తృణమూల్ కార్యకర్తలు, నాయకులు, అటు బీజేపీనేతలకు మధ్య తీవ్ర దుమారం రేగింది. వీరిని అదుపు చేసే క్రమంలో పోలీసులు లాఠీ చార్జీలు కూడా చేశారు. దీంతో ఎంపీ మజుందార్ తీవ్రంగా గాయపడ్డారు. ఇది మరో వివాదానికి దారి తీసింది. తనను పోలీసులు కోట్టారంటూ.. ఎంపీ పార్లమెంటు స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఇక, బాధితులమని చెబుతున్న మహిళలు.. మీడియా ముందుకు రావడం, వారికి బీజేపీ మద్దతు పలకడంతో వివాదం రాజుకుంది. దీనిపై మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించి.. ఏకంగా ఇద్దరు సభ్యులతో కూడిన కమిటీని సందేశ్ ఖలీ గ్రామానికి పంపించింది. అయితే.. వారిని కూడా తృణమూల్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఇలా.. ఒకదాని తర్వాత ఒకటి పరిస్థితులు ఏర్పడడంతో సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ.. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా ఎన్నికలకు ముందు బీజేపీ ఆడుతున్న నాటకంగా పేర్కొన్నారు. మరోవైపుబాధిత మహిళలను బయటకు తీసుకువచ్చిన మహిళా కమిషన్.. వారితో కేసులు పెట్టించింది. దీంతో 18 మంది అధికార పార్టీ కార్యకర్తలపై రేప్, హత్యాయత్నం కింద పోలీసులు కేసులుపెట్టారు. ఇక, రాష్ట్రంలోకి పార్లమెంటు ఎథిక్స్ కమిటీ రావడం ఏంటని ప్రశ్నిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టుకు ఎక్కింది. దీనిని విచారించిన కోర్టు ఎథిక్స్ కమిటీ పర్యటనపై స్టే విధించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం మరింత ముదురుతూనే ఉంది. సందేశ్ ఖాలీలో ప్రస్తుతం అప్రకటిత కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.