కౌంటర్ దాఖలు చేయని విజయమ్మ.. జగన్ కేసు మళ్లీ వాయిదా
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆమె తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మధ్య వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆమె తల్లి విజయమ్మ, సోదరి షర్మిల మధ్య వివాదం ఇప్పట్లో కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో సరస్వతీ పవర్ వాటాల విషయమై తల్లి, చెల్లిపై జగన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై తాజాగా విచారణ జరగ్గా, తమకు మరింత సమయం కావాలని విజయమ్మ, షర్మిల తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణ మార్చి 6వ తేదీకి వాయిదా పడింది.
సరస్వతీ పవర్ లో షేర్లను తనకు తెలియకుండా బదిలీ చేసుకున్నారని, అక్రమంగా బదిలీ చేసిన షేర్లను రద్దు చేయాలని మాజీ సీఎం జగన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ లో గత ఏడాదే పిటిషన్ దాఖలు చేశారు. షేర్ల బదిలీ ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు ఏమీ సమర్పించకుండానే తమ పేర్ల మీద మార్చుకున్నారని తల్లి, చెల్లిపై జగన్ ఆరోపణలు చేశారు. జగన్, ఆయన సతీమణి భారతి, క్లాసిక్ రియాల్టీ పేరిట షేర్లు కొనసాగేలా ఆదేశించాలని తన పిటిషన్లో కోరిన విషయం తెలిసిందే. సరస్వతీ పవర్ లో జగన్, ఆయన సతీమణి పేరిట 51.01 % షేర్లు ఉన్నాయి.
అయితే జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలంటూ ప్రతివాదులు విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు కోరుతూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విచారణ పలు మార్లు వాయిదా పడగా, తాజాగా మరో అవకాశం ఇవ్వాలని విజయమ్మ, షర్మిల తరఫు న్యాయవాదులు కోరారు. వారి వినతిని పరిగణలోకి తీసుకున్న కోర్టు కేసు విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది.