పాక్ కు వెళుతున్న సౌదీ యువరాజు.. అందుకేనా?
అందులో పాల్గొనేందుకు దుబాయ్ యువరాజు భారత్ కు వస్తున్నారు. ఆ క్రమంలో పాకిస్థాన్ లోనూ పర్యటించనున్నారు.
బతికి చెడితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయన్న దానికి తాజా చర్చే చక్కటి ఉదాహరణ. దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడెంత దీనంగా ఉందన్న విషయం తెలిసిందే. వనరులకు లోటు లేని ఆ చిట్టి దేశం.. భారత్ నుంచి విడిపోయిన నాటి నుంచి మన మీద పడి ఏడవకుండా.. తమను తాము డెవలప్ చేసుకోవటం మీద ఫోకస్ చేసి ఉంటే ఈ రోజు ఆ దేశం ఎక్కడో ఉండేది. ఆ దేశానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన ప్రతి ఒక్కరు భారత్ వ్యతిరేకతను రగిలించి.. సెంటిమెంట్ రాజేసి పబ్బం గడుపుకున్న వారే తప్పించి.. ఆ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన ఉన్నోళ్లు పెద్దగా లేరనే చెప్పాలి.
పాలకులు చేసిన తప్పులు.. వారిని వెనకేసుకొచ్చే ప్రజానీకం కలగలిపి.. ఈ రోజున పాకిస్థాన్ దరిద్రపు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఆ దేశంలో తాత్కాలిక ప్రభుత్వం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్.. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మునీర్ వ్యవహరిస్తున్నారు. జీ20 సదస్సుకు భారత్ అతిధ్యం ఇస్తున్న వేళ.. అందులో పాల్గొనేందుకు దుబాయ్ యువరాజు భారత్ కు వస్తున్నారు. ఆ క్రమంలో పాకిస్థాన్ లోనూ పర్యటించనున్నారు.
తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరి ఉన్న దేశంలో దుబాయ్ యువరాజు పర్యటించటం ఏమిటి? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. ఈ పర్యటన వెనుక లక్ష్యం ఆర్మీ చీఫ్ ఇమేజ్ ను బలోపేతం చేయటమేనన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు.. ఇదేమీ కాదు.. పాకిస్థాన్ అమ్మకానికి ఉంది. దాన్ని కొనే విషయంలో ఆసక్తి చూపుతున్న దేశాల్లో సౌదీ ఒకటి.. అందుకే ఆ దేశ యువరాజు పాకిస్థాన్ ను సందర్శిస్తున్నారన్న మాట బలంగా వినిపిస్తోంది. బతికి చెడిన వారంటే అందరికి చులకనే. అందుకు నిలువెత్తు నిదర్శనంగా పాక్ అమ్మకానికి ఉందన్న మాటేనని చెప్పాలి. రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా ఉన్న ఈ వ్యవహారం మీద పాక్ ఏ రీతిలో రియాక్టు అవుతుందో చూడాలి.