బీజేపీకి సీనియర్ నటి గౌతమి గుడ్ బై... తెరపైకి చీటింగ్ వ్యక్తి టాపిక్!
తెలుగు, కన్నడం, తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి గౌతమి ఇవాళ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
తెలుగు, కన్నడం, తమిళంతో పాటు పలు భారతీయ భాషల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి గౌతమి ఇవాళ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఇందులో భాగంగా ట్విట్టర్ లో రాజినామా లేఖను పోస్ట్ చేస్తూ... పాతికేళ్లుగా బీజేపీతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఇవాళ పార్టీకి తీవ్ర భావోద్వేగంతో గుడ్ బై చెబ్బుతున్నట్లు వెల్లడించారు.
అవును... బీజేపీతో సుమారు పాతికేళ్లుగా ఉన్న అనుబంధానికి ఈ రోజుతో స్వస్థి పలుకుతున్నట్లు నటి గౌతమి ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటానికి దారి తీసిన కారణాల్ని స్పష్టంగా పేర్కొన్నారు. తనను ఆర్ధికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి పార్టీ నేతలు కొందరు అండగా నిలవడంతోనే... గౌతమి సుమారు రెండున్నర దశాబ్ధాలకు పైగా అనుబంధం ఉన్న కాషాయపార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి వైజాగ్ లో చదువుకుంటున్న సమయంలోనే సినీరంగంలోకి ప్రవేశించిన గౌతమి.. ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ తెలుగు, తమిళ, కన్నడతో పాటు పలు భాషల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితురాలయ్యారు గౌతమి. దీంతో ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే తమిళనాడులో ఆ పార్టీ ఎదుగుదల సంగతి కాసేపు పక్కనపెడితే... తనకు అసలు గుర్తింపు లభించడం లేదనే అసంతృప్తి మాత్రం ఆమెకు పుష్కలంగా ఉందని అంటున్నారు!
ఇదే క్రమంలో... 2021లో జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో ఆమె రాజపాళయం నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. అయితే ఈమె అభిష్టాన్ని పార్టీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. ఈ అవమానాలు చాలవన్నట్లుగా... తనను ఆర్దికంగా మోసం చేసిన ఓ వ్యక్తికి బీజేపీ నేతలు అండగా నిలిచారని ఆమె ఆరోపిస్తున్నారు. దీనిపై పార్టీ పెద్దలకు ఎన్ని ఫిర్యాదులు చేసిన ఫలితం లేదని ఆమె చెబుతున్నారు.
తాను, తన కూతురూ సెటిల్ అయ్యి, సురక్షితంగా ఉన్నామనుకున్న దశలో.. అళగప్పన్ అల్లకల్లోలం చేశాడనీ.. తన డబ్బు, డాక్యుమెంట్లు, ఆస్తులను కాజేశాడని గౌతమి తన రాజినామా లేఖలో ఆరోపించారు. అళగప్పన్.. 20 ఏళ్ల కిందట తన జీవితంలోకి ప్రవేశించాడని, అప్పటికే తాను తల్లిదండ్రులను కోల్పోవడమే కాకుండా.. పసికందుతో ఉన్నట్లు తెలిపింది. ఆ సమయంలో తన కుటుంబంలోకి తమను ఆహ్వానిస్తున్నట్లు నటిస్తూ.. నిండా ముంచాడని ఆమె చెబుతున్నారు.
ఈ విషయాలపై స్పందించిన ఆమె... "ఈ రోజు నేను నా జీవితంలో ఊహించలేని సంక్షోభంలో ఉన్నాను. పార్టీ, నాయకుల నుండి నాకు ఎటువంటి మద్దతు లేదు. నన్ను మోసం చేసిన వ్యక్తికి మద్దతు ఇస్తున్నారని నాకు తెలుసు!" అని ఆమె ఎక్స్ లో పోస్ట్ చేసిన లేఖలో రాశారు. ఫలితంగా బీజేపీ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. దీంతో.. ఆమె రాసిన లేఖ, అందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారాయి.
ఇదే సమయంలో ఆమె త్వరలో అధికార డీఎంకే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. కాగా... కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీతో డీఎంకే పొత్తు చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకటి రెండు వేదికలపై కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్ లు కలిసి పాల్గొన్నారు. సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలను కమల్ సమర్ధించారు. ఈ నేపథ్యంలో గౌతమి కూడా డీఎంకే లో చేరే అవకాశాలున్నాయని అంటున్నారు.