కేసీయార్ ని ఓడిస్తా అంటున్న షబ్బీర్ అలీ

ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీటు మీదనే కేసీయార్ పోటీకి వస్తున్నారు.

Update: 2023-08-21 14:48 GMT

ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు అన్నట్లుగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి షబ్బీర్ అలీ సీటు మీదనే కేసీయార్ పోటీకి వస్తున్నారు. కామారెడ్డి నుంచి గత మూడున్నర దశాబ్దాలుగా షబ్బీర్ అలీ రాజకీయం చేస్తూ వస్తున్నారు. ఆయన 1989లో తొలిసారి కామారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు.

తొలిసారి ఎమ్మెల్యేగా ఉండగానే మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, మత్స్యశాఖ ఇంచార్జ్ మంత్రిగా పని చేశారు. అయితే కామారెడ్డిలో 1994, 1999లో షబ్బీర్ అలీ ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్ నుండి మరోసారి గెలిచారు. వైఎస్ కేబినెట్లో విద్యుత్, బొగ్గు, మైనార్టీ సంక్షేమం, వక్ఫ్, ఉర్దూ అకాడమీ శాఖల మంత్రిగా పని చేశారు.

అయితే 2009లో కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ ఓడిపోయారు. అంతే కాదు 2012, 2014, 2018లలోను ఓడిపోయారు. ఇలా వరస ఓటముల తరువాత తాజా ఎన్నికల్లో కామారెడ్డి నుండి షబ్బీర్ అలీ మరోసారి సిద్ధమైన సమయంలో కేసీఆర్ బరిలో దిగుతుండటం గమనార్హం. దీంతో షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్ చేశారు.

తన సీట్లో పోటీకి దిగుతున్న కేసీయార్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. అంతే కాదు ఆయన సొంత సీటు గజ్వేల్ లో సైతం ఓటమి పాలు అవుతారని జోస్యం చెప్పారు. కేసీయార్ ఓటమి భయంతోనే తన సీటు లో పోటీకి వస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇక కామారెడ్డిలో తాను పక్కా లోకల్ అని అన్నారు. కేసీయార్ వచ్చి పోటీ చేసినా కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. పార్టీ తనకే టికెట్ ఇస్తుందని ఆయన చెప్పుకున్నారు. కేసీయార్ కి గజ్వేల్ మీద నమ్మకం పోయిందని అందుకే రెండవ సీటు ఎంచుకున్నారని అన్నారు.

అయితే బీయారెస్ ఏర్పడిన తరువాత రెండు ఎన్నికల్లోనూ షబ్బీర్ అలీ ఓటమి పాలు అయ్యారు. అంతకు ముందు ఉమ్మడి ఏపీలోనూ కామారెడ్డిలో ఓటమి పాలు అయ్యారు. గంప గోవర్ధన్ ఆయనను ఇప్పటికి అయిదు సార్లు ఓడించారు అని బీయారెస్ వర్గాలు చెబుతున్నాయి. మొదటిసారి 1994లో గంప గోవర్ధన్ షబ్బీర్ అలీని ఓడించారు. ఆ తరువాత 2009లో టీడీపీ నుంచి పోటీ చేసి మళ్లీ అలీని ఓడించారు. 2012లో టీయారెస్ లోకి గంప గోవర్ధన్ జంప్ చేసి ఉప ఎన్నికలో పోటీ చేసి షబ్బీర్ అలీని ఓడించారు. 2014, 2018లో అయితే గంప గోవర్ధన్ అలీని ఓడించారు.

ఇలా ఈ సీటులో అయిదు సార్లు గెలిచి అన్ని సార్లూ షబ్బీర్ అలీని ఓడించిన గంప గోవర్ధన్ కి కామారెడ్డిలో సాలిడ్ గా బలం ఉంది అని అంటున్నారు. అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ గ్రాఫ్ కూడా పెరిగింది. దీంతో పాటు షబ్బీర్ అలీ మరోసారి గెలిచేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. ఈ తరుణంలో ఏకంగా కేసీయార్ పోటీకి దిగడం అంటే ఆయనకు అతి పెద్ద సవాల్ అంటున్నారు. అయితే తాను కచ్చితంగా గెలిచి తీరుతాను అని షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేయడమే కాదు కేసీయార్ నే ఓడిస్తాను అంటున్నారు. ఏది ఏమైనా కామారెడ్డి ఫైటింగ్ ఇపుడు అందరికీ ఆకట్టుకునేలా ఉంది.

Tags:    

Similar News