'మీరు సముద్రంలో హడావిడి చేయడం కాదు'... షర్మిల కీలక వ్యాఖ్యలు!

కాకినాడ పోర్ట్ కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందనే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-02 11:29 GMT

కాకినాడ పోర్ట్ కేంద్రంగా అక్రమంగా రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందనే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. పోర్ట్ లో రేషన్ బియ్యంతో ఉన్న షిప్ లలో ఒకటి ఏపీ ఆర్థిక మంత్రి వియ్యంకుడిది ఉందని.. దాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు సీజ్ చేయలేదని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల స్పందించారు.

అవును... కాకినాడ పోర్ట్ కేంద్రంగా విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారంటూ తెరపైకి వచ్చిన ఆరోపణల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం పెద్ద మాఫియా అని.. ఇది జాతీయ స్థాయి కుంభకోణం అని.. దీనిపై సిట్ లేదా సీబీఐ ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు, పవన్ లను షర్మిల డిమాండ్ చేశారు.

తాజాగా ఈ వ్యవహారంపై ఎక్స్ వేదికగా భారీ పోస్ట్ పెట్టిన ఏపీ పీసీసీ చీఫ్... రాష్ట్రంలో పీడీఎస్ రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని.. ఇదో జాతీయ స్థాయి కుంభకోనం అని.. పేదల పొట్టకొట్టి రూ.48 వేల కోట్ల ప్రజల డబ్బును పందికొక్కుల్లా తినేసిన దోపిడీ అని.. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లుగా ఈ వ్యవహారం సాగిందని అన్నారు.

రేషన్ బియ్యం స్మగ్లింగ్ వెనుక ప్రజా ప్రతినిధుల ప్రమేయం ఉందని.. కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకూ కొంతమంది అవినీతి అధికారుల పాత్ర ఉందని.. ఎవరికి దక్కాల్సిన వాటా వాళ్లకు చేరుతుండటంతో నిఘా వ్యవస్థ పూర్తిగా కళ్లు మూసుకుందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల విమర్శించారు.

గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలోని పోర్టుల నుంచి 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా అయ్యిందంటే మన చెక్ పోస్టుల పని తీరు ఎంటో అంచనా వేయొచ్చని.. ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని.. అక్రమ బియ్యాన్ని పట్టుకునేందుకు మీరు బోట్లూ వేసుకొని సముద్రంలో హడావిడి చేయడం కాదు.. నిజాలు నిగ్గు తేల్చండి అని అన్నారు.

ఇందులో భాగంగా... మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్ బియ్యాన్ని ఎలా సేకరించారు..? దీని వెనకున్న బియ్యం దొంగలెవరు..? రూ.48 వేల కోట్లు ఎవరెవరు తిన్నారు..? అప్పటి ప్రభుత్వ పెద్దలకు బియ్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయా..? మిల్లర్ల చేతివాటం ఉందా..? రేషన్ డీలర్ మాయాజాలమా..? నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఈ సందర్భంగా దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక దర్యాప్తు కమిటీ వేయాలని.. లేదా, కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తో విచారణ జరిపించాలని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లను షర్మిల డిమాండ్ చేశారు.

Tags:    

Similar News