70 ఏళ్లలో ఏపీసీసీ పగ్గాలు తొలిసారి మహిళకు.. తండ్రి పాత్రలో బిడ్

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి 70 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ- ఆంధ్రా కలయికకు ముందే ఏపీసీసీ ఏర్పడింది

Update: 2024-01-16 20:34 GMT

ఏపీలో ఒక రాజకీయ తతంగం పూర్తయింది. కారణాలు ఏమిటో తెలియదు.. అసలు విభేదాలు ఎందుకనేది ఎవరూ చెప్పలేరు.. ఎంతో ప్రేమించే సొంత అన్న అధికారంలో ఉండగా చెల్లెలు ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటారని ఎవరూ ఊహించి కూడా ఉండరు. కానీ, అంతా అలాగే జరిగిపోయింది. ఏపీ రాజకీయ తెరపై ఓ నాయకురాలు ప్రత్యక్షమయ్యారు. ఆ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు విడుదల చేసింది. ఆమె నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.

70 ఏళ్ల చరిత్ర..

ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఏపీసీసీ)కి 70 ఏళ్ల చరిత్ర ఉంది. తెలంగాణ- ఆంధ్రా కలయికకు ముందే ఏపీసీసీ ఏర్పడింది. 1953లో తొలి పీసీసీని ప్రకటించారు. అప్పుడు మాజీ రాష్ట్రపతి, ఉమ్మడి తొలి సీఎం నీలం సంజీవరెడ్డి నియమితులయ్యారు. ఆ తర్వాత బెడవాడ గోపాల్ రెడ్డి, దామోదరం సంజీవయ్య, మళ్లిపూడి పళ్లం రాజు, పీవీ నరసింహారావు, జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, కొణిజేటి రోశయ్య సహా ఎందరో దిగ్గజాలు పీసీసీ అధ్యక్షులుగా వ్యవహరించారు. వీరిలో వైఎస్ సహా చాలామంది సీఎంలయ్యారు.

జలగం, వైఎస్, డీఎస్ రెండేసి సార్లు

జలగం వెంగళరావు 1985-88 మధ్యలో, అంతకుముందు ఓసారి, వైఎస్ 1983, 1998లో రెండుసార్లు పీసీసీ చీఫ్ గా పనిచేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి.శ్రీనివాస్ 2004, 2008లో రెండుసార్లు ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ ముగ్గురికి మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఇక తాజాగా ఏపీ పీసీసీ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగించారు. ఇక్కడ విశేషం ఏమంటే.. తండ్రి నిర్వహించిన బాధ్యతల్లో కుమార్తె షర్మిల నియామకం కావడం. ఏపీ పీసీసీ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. ఇక 71 ఏళ్ల ఏపీ పీసీసీ చరిత్రలో తొలిసారి ఓ మహిళకు అధ్యక్ష బాధ్యతలు దక్కడం మరో విశేషం. ఇప్పటివరకు 26 మంది ఏపీసీసీ అధ్యక్షులుగా పనిచేయగా అందరూ పురుషులే. షర్మిల రూపంలో మొదటిసారి మహిళకు పగ్గాలు దక్కడం చెప్పుకోదగ్గదే.

Tags:    

Similar News