స్పందన బాగానే ఉందే ?

నేతలు ఎవరు చేరకపోయినా పాతకాపులు కాస్త యాక్టివ్ అవుతున్నారట.

Update: 2024-01-25 10:46 GMT

కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత నేతల్లో స్పందన బాగానే ఉన్నట్లుంది. ఎలాగంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తిగా ఉన్న వారు దరఖాస్తులు చేసుకోవాలని పార్టీ ప్రకటించింది. దరఖాస్తుల స్వీకరణ మొదలైన మొదటిరోజు అంటే బుధవారం 70 అప్లికేషన్లు వచ్చాయి.

మంగళవారం నుండి షర్మిల జిల్లాల పర్యటన మొదలుపెట్టారు. ఈ పర్యటనల ఉద్దేశ్యం ఏమిటంటే నేతలు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపటం. జనాల్లో కాంగ్రెస్ ఉనికిని చాటటం. అలాగే ఇతరపార్టీల్లోని లేదా రాజకీయాలకు దూరంగా ఉంటున్న పాత కాపులను మళ్ళీ పార్టీలోకి తీసుకోవటం.

ఈ మూడు లక్ష్యాలతో షర్మిల మొదలుపెట్టిన పర్యటన కాస్త సానుకూలంగానే ఉన్నట్లు పార్టీవర్గాల చెబుతున్నాయి. నేతలు ఎవరు చేరకపోయినా పాతకాపులు కాస్త యాక్టివ్ అవుతున్నారట. అలాగే నేతలు, క్యాడర్లో ఉత్సాహం కనబడుతోందని సమాచారం. ఎలాగూ ఎన్నికల సీజనే కాబట్టి షర్మిల కూడా ఫుల్లు దూకుడుమీదున్నారు. దాంతో మిగిలిన విషయాలు ఎలాగున్నా మీడియాలో ప్రచారమైతే బాగానే వస్తోంది. షర్మిలకు కావాల్సింది కూడా అదే.

ఇక దరఖాస్తుల విషయం చూస్తే 14 పార్లమెంటు, 56 అసెంబ్లీ నియోజకవర్గాలకు 70 దరఖాస్తులు అందినట్లు సమాచారం. ఎన్నికల నోటిపికేషన్ రిలీజయ్యేంతవరకు దరఖాస్తులు ఇస్తారు, తీసుకుంటారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దరఖాస్తులు ఇవ్వటం, తీసుకోవటం ఆపేస్తారట. ఎందుకంటే అప్పటివరకు వచ్చిన దరఖాస్తుల స్క్రీనింగ్ మొదలవుతుంది. ఏపీ ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతు కాంగ్రెస్ ను వీడిన నేతలంతా మళ్ళీ పార్టీలో చేరాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు.

175 అసెంబ్లీ, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో పార్టీ పోటీచేస్తుందని చెప్పారు. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయాన్ని పార్టీ తొందరలోనే ప్రకటిస్తుందన్నారు. కాంగ్రెస్ తో కలిసి వచ్చే పార్టీలతో నడవటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పారు. అయితే కాంగ్రెస్ తో నడవటానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదన్నదే అసలు పాయింట్. మరి నోటిఫికేషన్ విడుదలకు ఎన్ని దరఖాస్తులు వస్తాయో చూడాలి.


Tags:    

Similar News