ఫైనల్లీ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల!

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జనవరి 4న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Update: 2024-01-04 05:55 GMT

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ (వైఎస్సార్టీపీ) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల జనవరి 4న కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనవరి 3న తన కుమారుడి వివాహానికి తన సోదరుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ను ఆహ్వానించిన షర్మిల నేరుగా విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్లారు. గురవారం ఉదయం తన భర్త అనిల్‌ కుమార్‌ తో కలిసి ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో షర్మిల తన వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు.

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే తన లక్ష్యమని షర్మిల 2021, జూలై 8న పార్టీని ప్రారంభించారు. తెలంగాణలో 3,600 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. అయితే పేరున్న ఒక్క నేత కూడా ఆమె పార్టీలో చేరలేదు. షర్మిల కూడా పాలేరు నుంచి తాను పోటీ చేస్తానని చెబుతూ వచ్చారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు. తాను కానీ, తన పార్టీ కానీ అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన పార్టీని విలీనం చేశారు.

కాగా షర్మిలకు కాంగ్రెస్‌ పార్టీ కీలక బాధ్యతలు అప్పగించవచ్చని ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ షర్మిలకు ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ పగ్గాలు ఇస్తారని టాక్‌ నడుస్తోంది. లేదా ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా బాధ్యతలు అప్పగించవచ్చని చర్చ జరుగుతోంది. అలాగే ఆమెను పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లోకి లేదా జాతీయ కార్యవర్గంలోకి కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ లో పోయిన ప్రాభవాన్ని తిరిగి పొందాలనుకుంటున్న కాంగ్రెస్‌ అందుకు షర్మిలను అస్త్రంగా వాడుకోవాలని నిర్ణయించిందని అంటున్నారు. వైఎస్సార్‌ కుమార్తెగా ఆమెకున్న చరిష్మాతోపాటు మహిళకు ప్రాధాన్యం కల్పించామని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని భావిస్తోంది. అంతేకాకుండా తమను దెబ్బతీసిన జగన్‌ ను అదే కంటితో పొడిపించొచ్చని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిలకు రెండు పదవులు ఇవ్వాలని కాంగ్రెస్‌ నిర్ణయించిందని అంటున్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ కుమార్తెగా షర్మిలకున్న క్రేజును వాడుకోవాలని భావిస్తోంది.

కాగా షర్మిల వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తారని అంటున్నారు. అలాగే తన చిన్నాన్న వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె అయిన డాక్టర్‌ సునీతను కడప లోక్‌ సభా స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయించవచ్చని చెబుతున్నారు. తద్వారా వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి చెక్‌ పెట్టొచ్చని ఆమె భావిస్తున్నారని అంటున్నారు. ప్రస్తుతం కడప ఎంపీగా వైఎస్‌ అవినాష్‌ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే వీలుంది. ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్‌ అధిష్టానం ప్రోత్సాహంతో పక్కా ప్రణాళికతో ముందుకు సాగొచ్చని టాక్‌ నడుస్తోంది.

Tags:    

Similar News