విలీనంపై వైఎస్ షర్మిల బిగ్ ట్విస్ట్... నెక్స్ట్ జరిగేది ఇదే!
అవును.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్టీపీని స్థాపించిన వైఎస్ షర్మిళ.. అనంతరం పాదయాత్ర కూడా చేశారు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేసుకుని ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నాయి. మరోపక్క ఆశావహులు, అసంతృప్తులతో పార్టీ అధినేతలు బిజీగా గడుపుతున్నారు. ఆ సంగతి అలా ఉంటే... వైఎస్సార్టీపీ కి సంబంధించిన కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.
అవును.. తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ వైఎస్సార్టీపీని స్థాపించిన వైఎస్ షర్మిళ.. అనంతరం పాదయాత్ర కూడా చేశారు. ఒకానొకదశలో సమస్యలపై తీవ్రంగానే పోరాడారు. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకులకు సంబంధించిన సమస్యపై బలంగా తన గొంతు వినిపించారు. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం సీన్ రివర్స్ అయిపోయింది!
ఇందులో భాగంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంంతరం షర్మిళ ఉన్నపలంగా ఆ రాష్ట్ర పీసిసీ చీఫ్, ప్రస్తుతం డిప్యుటీ సీఎం డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. దీంతో... కాంగ్రెస్ తో పొత్తు కోసం షర్మిళ ప్రయత్నిస్తున్నారనే కామెంట్లు వినిపించాయి. అయితే పొత్తు కాదు, విలీన ప్రతిపాదన అవతలినుంచి ఉందని కథనాలొచ్చాయి. అయితే ఇప్పటివరకూ ఆ విషయంపై క్లారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో షర్మిళ ఢిల్లీ వెళ్లి సోనియా, రాహుల్ తో కూడా భేటీ అయ్యారు. అయితే ఇప్పటివరకూ ఈ విలీనం / పొత్తు వ్యవహారాలపై స్పష్టత రాలేదు. మరోపక్క వైఎస్సార్ తో మంచి సంబంధాలు కలిగిన సీనియర్లు కాంగ్రెస్ లోకి షర్మిళ రాకను ఆహ్వానిస్తుంటే... పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన వారు మాత్రం విభేదిస్తున్నారని చెబుతున్నారు.
ఈ సమయంలో షర్మిళ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో వైఎస్సార్టీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం సందర్భంగా... వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, పొత్తులపై చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో విలీనంపై కూడా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనంపై ఈ నెల 30వ తేదీ లోపు నిర్ణయం తీసుకుంటామని షర్మిల స్పష్టం చేశారు.
అనంతరం ప్రత్యామ్నాయ ఆలోచనపై కూడా షర్మిళ కీలక ప్రకటన చేశారు! ఇందులో భాగంగా ఒకవేళ విలీనం లేకుంటే మాత్రం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ బరిలోకి దిగుదామని నేతలకు కీలక సూచనలు చేశారు. ఇదే సమయంలో కార్యవర్గం ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ సందర్భంగా షర్మిళ భరోసా ఇచ్చారు.
ఇలా షర్మిల చేసిన తాజా కామెంట్స్ అటు కాంగ్రెస్, వైఎస్సార్టీపీలతో పాటు తెలంగాణ రాజకీయాల్లోనూ తీవ్ర చర్చకు తెరలేపాయి. ఒకవేళ షర్మిల ఒంటరిగానే అన్ని ప్రాంతాల్లోణూ బరిలోకి దిగితే కొన్ని స్థానాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలే ఛాన్స్ ఉందని అంటున్నారు పరిశీలకులు. మరి సెప్టెంబర్ 30 తర్వాత తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటూ చేసుకుంటాయనేది వేచి చూడాలి.