వైసీపీకి చెల్లెమ్మ శాపాలు...!
ఇది చెల్లెమ్మ షర్మిలమ్మ చెప్పిన మాటే. తాను వైసీపీ అనే మొక్కకు నీరు పోసి పెంచాను పెద్దదాన్ని చేశాను, ఇపుడు అది చెట్టుగా మారిందని చెప్పుకొచ్చారు
అధికార పార్టీ నేతలు కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా అలాగే బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి షర్మిల మీద చేసిన హాట్ కామెంట్స్ కి షర్మిల నగరి సభలోనే గట్టిగా రిటార్ట్ ఇచ్చారు.
నోరుంది కదా అని విమర్శించవద్దు అని రోజాను హెచ్చరించారు. తెలంగాణాలో అలాగే నోరు పారేసుకున్న నేతలు ఓడి ఇంట్లో కూర్చున్నారు అని ఇపుడు ఏపీలో వైసీపీ నేతలకూ అదే గతి పడుతుందని షర్మిల జోస్యం చెప్పారు. తాను రాజన్న బిడ్డను అని కూడా చూడకుండా దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు అని షర్మిల మండిపడ్డారు. వైసీపీని తాను పెంచానని ఇపుడు అదే పార్టీ వారు తనను విమర్శిస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చెల్లెమ్మ షర్మిలమ్మ చెప్పిన మాటే. తాను వైసీపీ అనే మొక్కకు నీరు పోసి పెంచాను పెద్దదాన్ని చేశాను, ఇపుడు అది చెట్టుగా మారిందని చెప్పుకొచ్చారు. మరి ఆమె ఇపుడు పెంచిన చెట్టునే నరికేస్తారా అని ప్రశ్నలు వస్తున్నాయి. నా అవసరం ఇపుడు లేదని అంటున్నారు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాగే తనకు ఏ పదవులూ అవసరం లేదని ఆమె అన్నారు. ఆమెకు ఏ పదవులూ అవసరం లేకపోతే ఎందుకు కాంగ్రెస్ పార్టీ సారధ్యం తీసుకుని వైసీపీకి ఎదురుగా నిలిచి పోరాడుతున్నారో అని అధికార పార్టీ నుంచి వస్తున్న ప్రశ్నలు. అంతే కాదు ఆమె పదవులు వద్దు అనుకున్నపుడు తెలంగాణలో పార్టీ పెట్టారు, అక్కడ ఆమె మూడేళ్ళు తిరిగారు. అయినా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇపుడు ఏపీకి వచ్చారు.
గత నెల రోజులుగా ఆమె కాంగ్రెస్ తరఫున తిరుగుతున్నారు. ఆ పార్టీకి ఎంతో కొంత హుషార్ అయితే తెచ్చారు. కానీ కాంగ్రెస్ కి ఏపీలో ఎంతటి స్థానం ఉందో అందరికీ తెలిసిందే. ఎన్నికల ముందు వచ్చిన షర్మిల తాను ప్రజల కోసమే పోరాడుతున్నాను అని అంటున్నారు. అదే నిజం అనుకుంటే ఆమె మూడేళ్ళ క్రితమే ఏపీలో ప్రజల తరఫున పోరాడి ఉంటే ఆమెకూ కాంగ్రెస్ కి కూడా ఈ రోజు ఎంతో ఆదరణ పెరిగేదని అంటున్నారు.
అలా కాకుండా ఎన్నికల ముందు వస్తే కాంగ్రెస్ ఏ మాత్రం ఎగ్గిగిల్లుతుందో తెలియదు కానీ విపక్షానికే మేలు జరుగుతుందని అంటున్నారు. అందుకే ఇదిలా ఉంటే ప్రతీ రోజూ షర్మిల వైసీపీ మీద విమర్శలు ఎక్కు పెడుతున్నారు. దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంటోంది. దాంతో ఇటు నుంచి ఒకటికి రెండు రెండుకు నాలుగు అన్నట్లుగా షర్మిల విమర్శలు ఉంటున్నాయి. ఏది ఏమైనా షర్మిల మాత్రం తగ్గేదే లేదు అనే అంటున్నారు. మొత్తానికి ఎన్నికల వేళ అధికార పార్టీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారుతోంది అని అంటున్నారు.