శివాజీ సీక్రెట్ వెపెన్.. 350 ఏళ్ల తర్వాత భారత్ కు!
ఊరికే ఏమీ జరగదు. అందునా రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమాన్ని తమకు తాముగా చేపట్టారంటే దానికి ఉండే లెక్కలు దానికి ఉంటూ ఉంటాయి.
ఊరికే ఏమీ జరగదు. అందునా రాజకీయ నాయకులు.. ప్రభుత్వాలు ఏదైనా కార్యక్రమాన్ని తమకు తాముగా చేపట్టారంటే దానికి ఉండే లెక్కలు దానికి ఉంటూ ఉంటాయి. ఈ విషయాన్ని ఎవరూ కాదనలేరు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని చూసినంతనే చాలామంది తీవ్రమైన భావోద్వేగానికి గురవుతారు. నిజానికి అక్కడి ప్రభుత్వానికి కావాల్సింది కూడా అదే. కానీ.. ఈ మొత్తం ప్రోగ్రాం వెనుక అసలు ఉద్దేశం రాజకీయమే. మరికొద్ది నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరింత మైలేజ్ ఆశిస్తున్న అధికార పార్టీ.. అందుకు తగ్గట్లే తన ఎజెండాను అమల్లోకి తీసుకొచ్చింది. బయట నుంచి చూసినప్పుడు మాత్రం అందుకు భిన్నమైన కలరింగ్ ఇవ్వటం గమనార్హం.
మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడో భారీ ప్రచారానికి తెర తీసింది. మఠారా యోధుడు శివాజీ మహారాజ్ కు చెందిన రహస్య ఆయుధాన్ని 350 ఏళ్ల తర్వాత భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నాల్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసింది. బాఘ్ నఖ్ పేరుతో ఉండే పులిపంజాను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లండన్ నుంచి భారత్ కు తీసుకొచ్చారు. బుల్లెట్ ఫ్రూఫ్ కవర్ లో తెచ్చిన దీన్ని ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉంచారు.
ఈ కార్యక్రమాన్ని ఏక్ నాథ్ శిండే ప్రభుత్వం భారీగా ప్రమోట్ చేస్తోంది. ఈ రహస్య ఆయుధాన్ని మ్యూజియంలో పెట్టిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో పాటు.. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (బీజేపీ) తో పాటు పార్టీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు. ఈ ఆయుధాన్ని ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచనున్నారు.
ఇంతకాలం ఈ ఆయుధాన్ని లండన్ లోని అల్బర్ట్ మ్యూజియంలో ఉండేది. వందల ఏళ్లుగా లండన్ మ్యూజియంలో ఉన్న ఆ రహస్య ఆయుధాన్ని ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు చూపించాలన్న ఉద్దేశంతో ఇండియాకు తీసుకొచ్చారు. దీనికి కోసం యూకేతో మూడేళ్ల ఒప్పందాన్ని చేసుకున్నారు. ఇంతకాలం లేనిది.. ఇప్పుడే ఎందుకు? అన్న ప్రశ్నను వేసుకుంటే ఆసక్తికర సమాధానం వస్తుంది.
ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అధికార పక్షంగా ఉన్న శివసేన (శిందే వర్గం) మరింత మైలేజ్ కోసం తపిస్తోంది. ఉద్దవ్ తో విభేదించి.. బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతికూలతను అధిగమించేందుకు.. తమ పట్ల.. తమ ప్రభుత్వం పట్ల సానుకూలతను పెంచుకోవటంతో పాటు.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు వీలుగా ప్లాన్ చేయటం తెలిసిందే.
ఎన్నికల వేళ.. ప్రజల భావోద్వేగాల్ని తమతో ఉండేందుకు వీలుగా శివాజీ రహస్య ఆయుధాన్ని రాష్ట్రాన్ని తీసుకురావటం ద్వారా ప్రజల మనసుల్ని దోచుకోవాలని భావించింది. అందుకు తగ్గట్లే.. ఈ ఆయుధాన్ని తీసుకొచ్చింది. శివాజీని అమితంగా ఆరాధించే పార్టీగా పేరున్న తాము.. శివాజీకి సంబంధించిన కీలక వస్తువును తీసుకురావటం ద్వారా పొలిటికల్ మైలేజీ వస్తుందన్న ఆలోచనలో ఉంది. అందుకు తగ్గట్లే సీక్రెట్ వెపెన్ ను మూడున్నర శతాబ్దాల తర్వాత భారత్ కు తీసుకొచ్చారు. మరి.. శిందే సర్కారు ఆశించినట్లు ఎన్నికల వేళ జరుగుతుందా? లేదా? అన్నది చూడాలి. ఇక.. ఈ సీక్రెట్ ఆయుధం గురించి.. దాని ప్రత్యేకతతో పాటు.. దాని చరిత్రను చూస్తే బోలెడన్ని విషయాలు కనిపిస్తాయి.
1649లో ఛత్రపతి శివాజీ బీజాపుర్ సుల్తాన్ ను ఓడించి.. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించటం తెలిసిందే. దానికి ముందు బీజాపుర్ సేనాధిపతి అఫ్జల్ ఖాన్ తో భేటీ అవుతాడు. ఈ సందర్భంగా తాను రహస్యంగా దాచుకున్న ఈ బాఘ్ నఖ్ ను ఉపయోగించి అతడ్ని చంపేస్తాడు. దీనికి వేదికగా ప్రతాప్ గఢ్ కోట. ఇదిప్పుడు సతారాలో ఉంది. అందుకు శివాజీ వాడిన రహస్య ఆయుధాన్ని అక్కడికే తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో భావోద్వేగాన్ని రగల్చాలని ప్రయత్నిస్తోంది.