సవాలుకు సమాధానం సరే, టోన్ లో ఇదేం ఎటకారం స్మితాజీ?
ఈ విషయంలో స్మిత ప్రదర్శిస్తున్న దూకుడును తప్పు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ అవుతోంది.
రెండు వైపులా పదునున్న ఆయుధం సోషల్ మీడియా. దాన్ని ఎప్పుడు ఎంతలా వాడాలన్న విషయంలో చిన్నపాటి బ్యాలెన్సు మిస్ అయినా జరిగే నష్టం చాలా ఎక్కువగా ఉంది. సోషల్ మీడియాను అసరాగా చేసుకొని పైకి ఎదిగిన వాళ్లు ఉన్నారు. అదే సమయంలో పాతాళానికి పడిపోయినోళ్లు ఉన్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు. సాదాసీదా వ్యక్తుల సంగతి ఫర్లేదు కానీ.. సమాజంలో కీలక స్థానాల్లో ఉన్న వారు సోషల్ మీడియా విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఈ విషయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితసబర్వాల్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది.
అత్యుత్తమ సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై సోషల్ మీడియాలో ఆమె వెల్లడించిన అభిప్రాయంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తటం.. దీనిపై పెను దుమారం రేగటం తెలిసిందే. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా.. స్మిత మాత్రం తన మాట మీదే ఉన్నారు. తన అభిప్రాయాన్ని విభేదిస్తున్న వారు పెద్ద ఎత్తున ఉన్నప్పటికి తగ్గట్లేదు సరి కదా.. ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదేం తప్పు అని చెప్పలేం. కానీ.. ఈ సందర్భంగా ఆమె మాటల్లో వినిపిస్తున్న ఎటకారాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
తాజా ఉదంతంలో స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఐఏఎస్ కాడమీ నిర్వాహకురాలు బాలలత.. తనతో పోటీ పరీక్షకు స్మిత సిద్దమా? అంటూ సవాలు విసరటం తెలిసిందే. మళ్లీ పరీక్ష రాద్దాం. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం’ అంటూ సవాలు విసిరారు. ఇలాంటి సవాలుకు సమాధానంగా స్మిత స్పందించిన తీరు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
‘మీ విచిత్రమైన సవాల్ స్వీకరిస్తున్నా. సివిల్స్ పరీక్ష మళ్లీ రాయటానికి నేను సిద్ధం. కానీ.. వయసు పైబడటంతో యూపీఎస్సీ అనుమతిస్తుందా అని అనుమానంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనికి స్మైలీ ఎమోజీని యాడ్ చేశారు. నిజానికి బాలలత చేసిన వ్యాఖ్యల్ని ఒక సీనియర్ జర్నలిస్టు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయగా.. దానికి స్పందించిన స్మితా సబర్వాల్.. ఒక ట్వీట్ చేస్తూ.. ‘‘బాలలత అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మిమ్మల్ని కోరుతున్నా. వికలాంగుల కోటా ఉపయోగించి ఆమె ఐఏఎస్ గా ఎంపికైంది దేని కోసం? కోచింగ్ సెంటర్ నడపటానికా? క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయటానికా? అని బాలలతను ప్రశ్నించండి’ అంటూ ట్వీట్ చేశారు.
ఏదైనా విషయం మీద స్మిత సబర్వాల్ ఒక అభిప్రాయానికి వస్తే.. దానిపై ఆమె ఎంత బలంగా ఉంటారన్నది తెలిసిందే అయినా.. సున్నిత అంశాలపై మాట్లాడే వేళలో ఆచితూచి అన్నది అత్యవసరం. దివ్యాంగుల విషయంలో మాట్లాడే సందర్భంలో చాలా అంశాల్ని పరిగణలోకి తీసుకోవాలి. పరిమితమైన ఆలోచనలతో కాకుండా విస్త్రత అంశాల్ని పరిగణలోకి తీసుకొని అభిప్రాయాల్ని వెల్లడించాల్సి ఉంటుంది.
ఈ విషయంలో స్మిత ప్రదర్శిస్తున్న దూకుడును తప్పు పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువ అవుతోంది. ఈ విషయాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా గుర్తించాల్సి ఉంటుందంటుననారు. దివ్యాంగులపై స్మితా చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్టర మంత్రి సీతక్క సైతం స్పందించారు. ఆమె వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి రేవంత్ ద్రష్టికి తీసుకెళతానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతరుల అభిప్రాయాలను గుర్తించకపోవటం మానసిక వైకల్యంగా అభివర్ణించిన ఆమె అంగవైకల్యం కంటే బుద్ధి వైకల్యం ప్రమాదకరమని పేర్కొన్నారు. సాధారణంగా సవాళ్లు విసిరే ఏ సందర్భంలోనూ దానికి చట్టబద్ధత ఏమీ ఉండదన్నది అందరికి తెలిసిన విషయమే. దానిపై స్పందించి రచ్చ చేసుకోవటంలో అర్థం లేదు. ఒకవేళ సమాధానం తప్పనిసరిగా ఇవ్వాలని అనుకున్నప్పుడు.. మరికాస్త సెటిల్డ్ గా చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.