డీలిమిటేషన్ మీద జనసేన స్టాండ్ ఏంటి ?
మరీ ముఖ్యంగా ఆలోచిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల సమస్య. భావి తరాల సమస్యగా చూడాలి.;
జనాభా ప్రాతిపదికన దేశంలో డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది అని అంటున్నారు. అదే కనుక జరిగితే జనాభా తక్కువగా ఉన్న దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయన్నది వాస్తవం అని నిపుణులు అంటున్నారు. ఇది రాజకీయ సమస్య కానే కాదు రాష్ట్రాల సమస్య. మరీ ముఖ్యంగా ఆలోచిస్తే దక్షిణాది రాష్ట్రాల ప్రజల సమస్య. భావి తరాల సమస్యగా చూడాలి.
అయితే సౌత్ స్టేట్స్ లో ఏపీ మాత్రమే ఎండీయే చేతిలో ఉంది. తెలంగాణా కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. తమిళనాడు కేరళలో ఇండియా మిత్రులు ఉన్నారు. దీంతో ఏపీ మీదనే అందరి దృష్టి ఉంది. డీలిమిటేషన్ మీద ఏపీ పార్టీల స్టాండ్ ఏంటి అన్నది అందరినీ ఆసక్తిని పెంచుతోంది. ఇక చూస్తే కనుక ఏపీలో మూడు ప్రధాన పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం వైసీపీ జనసేన ఆ పార్టీలు.
ఈ మూడింటిలో రెండు బీజేపీతో ఎన్డీయే అలయెన్స్ లో ఉన్నాయి. వైసీపీ న్యూట్రల్ గా ఉంది. అందుకే వైసీపీని కలసి తమిళనాడు మీటింగ్ కి డీఎంకే నేతలు ఆహ్వానించారు. ఎన్డీయే పార్టనర్స్ గా ఉన్నాయి కాబట్టి టీడీపీ జనసేనలను ఆహ్వానించాయా లేదా అన్నది తెలియదు. అయితే జనసేన తాజాగా చెన్నై మీటింగ్ మీద రియాక్టు అయింది.
ఈ సమావేశానికి తమను స్టాలిన్ అహ్వానించారు అని పేర్కొంది. అయితే తాము ఈ మీటింగ్ కి హాజరు కాలేమని తేల్చేశామని చెప్పింది. వేరు వేరు కూటములలో ఉన్నందువల్ల తాము ఈ మీటింగ్ కి రావడం మర్యాదగా ఉండదని తెలియచేయాలని తమ అధినేత పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేశారని జనసేన ఒక ప్రకటనలో పేర్కొంది.
ఇక డీలిమిటేషన్ మీద డీఎంకే సహా కొన్ని పార్టీలకు ఉన్న అభిప్రాయాలు వారివి అని జనసేన అని తెలిపింది. తమకూ ఈ విషయం మీద నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించింది. తమ అభిప్రాయాలను సాధికారిత వేదిక మీద వెల్లడిస్తామని జనసేన పేర్కొంది.
మరి జనసేన స్టాండ్ ఏంటి అన్న చర్చ అయితే సాగుతోంది. డీలిమిటేషన్ మీద ఇప్పటికే మేధావులు ప్రముఖులు నిపుణులు అంతా దక్షిణాదికి తీవ్ర నష్టం వస్తుంది అని అంటున్నారు. ఎందుకంటే జనాభా ప్రాతిపదికన చేస్తున్నారు కాబట్టి అని గుర్తు చేస్తున్నారు.
మరి సౌత్ స్టేట్స్ కంటే ఉత్తరాదికే జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్ వల్ల లాభం అని అంటున్నారు. ఎందుకంటే అక్కడ జనాభా సాంద్రత ఎక్కువ కాబట్టి అని చెబుతున్నారు. కేంద్రం అమలు చేయనున్న డీలిమిటేషన్ ని అంతా వ్యతిరేకించడానికి తగిన రీజన్స్ ఇవే. ఈ విషయంలో సౌత్ స్టేట్స్ ని అన్యాయం జరుగుతుంది అన్న దాని మీద ఎవరికీ ఎలాంటి అనుమానాలు అయితే లేవు.
ఇక కేంద్ర పెద్దలు చెబుతున్న దాని బట్టి సీట్లు తగ్గవన్న వాదన ఉంది. కానీ సీట్లు ఉత్తరాదిన పదుల సంఖ్యలో పెరుగుతున్నపుడు దక్షిణాదిన ఉన్న సీట్లు అలాగే ఉన్నా లేక ఒకటి రెండు సీట్లు పెరిగినా కూడా అది భారీ వ్యత్యాసం ఉత్తరాది దక్షిణాది మధ్యన చూపిస్తుందని కూడా నిపుణులు అంటున్నారు.
ఇలా పీట ముడి వేసుకున్న డీలిమిటేషన్ వ్యవహారంలో జనసేన తన విధానం తనకు ఉంది అని అంటున్నారు. సహజంగా ఎన్డీయే కూటమిలో ఉన్నందువల్ల కేంద్రం నుంచి ఏమైనా రిలాక్సేషన్ కోరే చాన్స్ ఉందా లేదా జనాభా ప్రాతిపదిక కాదు వేరే విధానం అమలు చేయమని కేంద్రానికి సూచిస్తుందా అన్నది చర్చగా ఉంది. జనసేన స్టాండ్ ఏంటి అన్నది ఆ పార్టీ ప్రకటించాకనే స్పష్ట వస్తుంది. మొత్తానికి చూస్తే రాజకీయాలు కాకుండా రాష్ట్రాలు వాటి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఏ పార్టీ అయినా విధానం ప్రకటించాలని మేధావులు ప్రజాస్వామ్య ప్రియులు కోరుతున్నారు.