రంగంలోకి దిగిపోయిన బాలయ్య చిన్నల్లుడు...!
తాజాగా ఆయన మత్య్సకారులతో కలసి సముద్రంలోకి వెళ్ళి మరీ స్వయంగా వారి కష్టనష్టాలను చూశారు.
టీడీపీ అధినాయకత్వం విశాఖ ఎంపీ సీటుని ఖరారు చేయలేదు. కానీ బాలయ్య చిన్నల్లుడు దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు అయిన శ్రీభరత్ ఎన్నికల రంగంలోకి దిగిపోయారు. ఆయన ప్రచారాన్ని మొదలెట్టేశారు. తాజాగా ఆయన మత్య్సకారులతో కలసి సముద్రంలోకి వెళ్ళి మరీ స్వయంగా వారి కష్టనష్టాలను చూశారు. అక్కడే వారితో పాటే సముద్రం మధ్యలో పడవలో కూర్చుని భోజనం చేశారు.
అలా ఆయన తన ప్రచారాన్ని వినూత్నంగా ప్రారంభించారు. ఎక్కువగా పేదల కాలనీలలో పర్యటిస్తున్నారు. వారితో కలసి ముచ్చట్లు పెడుతున్నారు. వారితోనే సహ పంక్తి భోజనాలు చేస్తున్నారు. పెద్ద సభలు మీటింగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ కి శ్రీభరత్ ప్రాధాన్యత ఇస్తున్నారు.
దానితో పాటు ఎమ్మెల్యే అభ్యర్ధులుగా పార్టీ తొలివిడతలో డిక్లేర్ చేసిన వారితో కలసి కూడా పర్యటిస్తున్నారు. ప్రచారం చేస్తున్నారు. విశాఖ ఎంపీ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సీట్లు గానూ విశాఖ తూర్పు, పశ్చిమ అభ్యర్ధులను మాత్రమే పార్టీ ప్రకటించింది.
ఇంకా భీమిలీ గాజువాక విశాఖ సౌత్, నార్త్, ఎస్ కోటలకు సంబంధించి అభ్యర్ధుల ప్రకటన చేయాల్సి ఉంది. అలాగే బీజేపీతో పొత్తు కుదిరితే వారికి కూడా ఒక సీటు ఇవ్వాల్సి రావచ్చు. అపుడు ఉమ్మడి ప్రచారం ఉంటుంది అని అంటున్నారు. విశాఖ ఎంపీ సీటు విషయంలో బీజేపీ పట్టుబడుతోంది. తనకు ఇవ్వాలని కోరుతోంది.
అయితే టీడీపీ మాత్రం శ్రీభరత్ కే ఇవ్వాలని చూస్తోంది. ఈ విషయంలో నారా లోకేష్ కూడా తోడల్లుడికి పూర్తి మద్దతుగా నిలిచారు అని అంటున్నారు. నారా లోకేష్ యువగళం అలాగే శంఖారావం కార్యక్రమాలు విశాఖలో సక్సెస్ వెనక శ్రీ భరత్ ఉన్నారు అని అంటున్నారు. తోడళ్ళుల్లు ఇద్దరూ ఒక్కటిగా నిలిచి టీడీపీ సభలలో ఆకర్షణగా మారారు. యంగ్ బ్లడ్ ని లోకేష్ ప్రోత్సహిస్తున్నారు. దాంతో పాటు బంధువు కూడా కావడంతో ఈసారి శ్రీభరత్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుంది అని భావిస్తున్నారుట.
అంతే కాదు 1999 తరువాత విశాఖ ఎంపీ సీటుని టీడీపీ గెలుచుకోలేదు. అంటే పాతికేళ్లు పై బడింది అన్న మాట. 2004, 2009లలో కాంగ్రెస్, 2014లో బీజేపీ, 2019లో వైసీపీ ఇక్కడ నుంచి గెలిచాయి. దాంతో ఈసారి కూడా పొత్తులో బీజేపీకి ఇచ్చేస్తే టీడీపీ శాశ్వతంగా విశాఖ ఎంపీ స్థానాని వదులుకున్నట్లే అని పార్టీ హై కమాండ్ భావిస్తోంది.
అంతే కాదు విశాఖ సిటీకి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని తామే ఈ సీటు నుంచి పోటీ చేస్తామని అంటోంది. ఇక్కడే బీజేపీకి టీడీపీకి పంచాయతీ వస్తోంది అని అంటున్నారు. ఆరు నూరు అయినా టీడీపీ విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేయడం ఖాయమని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. దాంతో శ్రీ భరత్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అందుకే ఆయన ప్రచారం ముమ్మరం చేశారని అంటున్నారు.