మోడీతో సౌత్ వార్ : స్టాలిన్ సూపర్ సక్సెస్ !
తమిళుల హక్కులు వారి ప్రంతీయత, వారి కల్చర్, వారి గుర్తింపునకు పెద్ద పీట వేస్తారు. అయితే ఇదంతా కేవలం తమిళనాడు రాష్ట్రం దాకానే ఉంటూ వచ్చింది.;
కేంద్రంలోని ఉత్తర భారత పాలకుల పెత్తనం ఏంటన్నది ద్రవిడ వాదం బలంగా ఉండే తమిళనాడులో మొదటి నుంచి వినిపించే నినాదం. అది ఒక శతాబ్దంగా అలాగే సాగుతూ వస్తోంది. రాజకీయ రూపం తీసుకుని డీఎంకే అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చినా ద్రవిడ వాదం విషయానికి వచ్చేసరికి అంతా ఒక్కటిగానే నిలుస్తారు. ఇక హిందీని ఉత్తరాది భాషగా భావిస్తూ వ్యతిరేకిస్తారు.
తమిళుల హక్కులు వారి ప్రంతీయత, వారి కల్చర్, వారి గుర్తింపునకు పెద్ద పీట వేస్తారు. అయితే ఇదంతా కేవలం తమిళనాడు రాష్ట్రం దాకానే ఉంటూ వచ్చింది. తమిళనాడుని ఎందరు సీఎంలు ఏలినా కూడా వారు తమిళనాడు చుట్టూనే తమ రాజకీయాన్ని సాగిస్తూ వచ్చారు. అందులో విజయం సాధించారు కానీ స్టాలిన్ మాత్రం సౌత్ స్టేట్స్ ని ఏకం చేయడం మీద మక్కువ చూపిస్తున్నారు. ఈ విషయంలో ఆయన చేసిన తొలి ప్రయత్నమే విజయం కావడంతో డీఎంకే శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకాలం తమిళనాడు బాధ దక్షిణాది బాధగా ఉండేది. కానీ ఇపుడు అలా కాదు మొత్తం దక్షిణాది బాధను తమ బాధగా తమిళనాడు మార్చుకుంది. దాంతో ఇక్కడే స్టాలిన్ వ్యూహం సక్సెస్ అయింది అని అంటున్నారు. కేవలం తమిళనాడు వరకే పరిమితం అయితే స్టాలిన్ ని బీజేపీ పెద్దలు తమ వ్యూహం ప్రకారం కార్నర్ చేసేవారు. కానీ ఆయన ఇపుడు మొత్తం సౌత్ స్టేట్స్ ని కలుపుకుంటూ కేంద్రంలోని మోడీ సర్కార్ మీద వార్ ని ప్రకటించారు.
ఇక దీనికంటే ముందు స్టాలిన్ కేంద్రం మీద తన బలమైన పోరాటాన్ని చూపించారు. దాని వల్లనే ఆయన ఇచ్చిన పిలుపు మేరకు దక్షిణాదిన ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులు పార్టీల ప్రతినిధులు హాజరయ్యారని అంటున్నారు. కేరళ, తెలంగాణాణా పాండించ్చేరి, పంజాబ్ వంటి నాలుగు రాష్ట్రాల సీఎంలు ఈ మీటింగుకు హాజరయ్యారు అంటే అది విశేషంగానే చూడాలి. ఇక కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరయ్యారు.
అలాగే తెలంగాణా నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ హాజరయ్యారు. దాంతో మోడీకి వ్యతిరేకంగా డీలిమిటేషన్ విధానాలకు వ్యతిరేకంగా స్టాలిన్ నిర్వహించిన చెన్నై ఫస్ట్ మీటింగ్ సూపర్ సక్సెస్ అయింది అని అంటున్నారు.
గతంలో చూస్తే మోడీకి వ్యతిరేకంగా చాలా మంది వ్యతిరేక శిబిరాలను ఏర్పాటు చేయడానికి తహతహలాడారు. బీఆర్ఎస్ అధినేత కేసేఅర్ కూడా తెలంగాణాకు రెండవసారి సీఎం అయినపుడు ఇలాగే చేయాలని చూశారు. మూడవ పక్షమని మోడీకి వ్యతిరేకంగా అంతా ఒక్కటి కావాలని ఆయా నేతలు పిలుపు ఇచ్చినా అవి అంతగా ఫలించలేదు అనే చెప్పాలి.
ఇక మోడీకి యాంటీ అంటూ ఇండియా కూటమి కట్టారు. దానికి కాంగ్రెస్ పెద్దన్నగా వ్యవహరించింది. కానీ అందులో చేరిన పార్టీలను వాటి మద్దతుని నిలుపుకునే విధంగా ఇండియా కూటమి వ్యవహరించలేకపోయింది. దాంతో ఇండియా కూటమి ఇపుడు పార్టీలు తలోదారి అన్న లెక్కన ఉండడంతో ఇబ్బంది పడుతోంది.
కానీ స్టాలిన్ నేతృత్వంలో తొలిసారి పిలుపు ఇస్తే ప్రాంతీయ పార్టీలు చాలా మటుకు స్పందించాయి. అలాగే కీలక నేతలు అంతా కలసి హాజరయ్యారు. ఆ విధంగా చూస్తే స్టాలిన్ సక్సెస్ అయ్యారనే అంటున్నారు. కేవలం డీలిమిటేషన్ మాత్రమే కాదు హిందీ రుద్దుడు మీద జీఎస్టీ పన్నుల్లో వాటాల విషయంలో దక్షిణాది మీద వివక్ష వంటి వాటి మీద స్టాలిన్ చాలా కాలంగా పోరాడుతున్నారు.
అందువల్ల ప్రస్తుతానికి డీలిమిటేషన్ అజెండాతో చెన్నై మీటింగ్ జరిగినా రానున్న రోజుల్లో దక్షిణాది మీద వివక్ష ఉత్తరాది పెత్తనం, కేంద్ర పన్నులలో తగిన వాటా దక్కడం లేదు అన్న వాటి మీద కూడా పోరు సాగించే అవకాశం ఉంది. ఏది ఏమైనా సౌత్ నుంచి మోడీకి కేంద్రానికి వ్యతిరేకంగా ఒక బలమైన శిబిరాన్ని ఏర్పాటు చేయడంలో స్టాలిన్ తొలి అడుగు గట్టిగా వేశారు అని అంటున్నారు.
మోడీ వ్యతిరేక అజెండాతో ముందుకు సాగుతున్న స్టాలిన్ కి ఈ మీటింగ్ ఈ సంఘీభావం కొత్త బలాన్ని ఇస్తాయని అంటున్నారు. దేశంలో మోడీకి వ్యతిరేకంగా నిలిచే పార్టీలు నాయకులు కానీ కనిపించడంలేదు. మమతా బెనర్జీ బెంగాల్ లో యాంటీ మోడీ స్టాండ్ తీసుకున్నా ఆమె ఎపుడెలా టర్న్ అవుతారో తెలియడంలేదు అని అంటారు.
కాంగ్రెస్ ని దేశంలో చాలా పార్టీలు నమ్మడంలేదు. దాంతో స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయన ప్రాంతీయ పార్టీలను సులువుగా కలుపుకుని పోగలరన్న నమ్మకం కలిగించారు. దాంతో 2029 ఎన్నికల నాటికి దేశంలో మోడీ వ్యతిరేక శిబిరాన్ని దక్షిణాది నుంచే ఏర్పాటు చేసి అందులో వీలైనన్ని పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ తో సహా అందరినీ ఏకత్రాటి మీదకు తెచ్చి మోడీతో ఢీ కొట్టగల సామర్ధ్యం అయితే స్టాలిన్ కి ఉందనే అంతా నమ్ముతున్నారు. సో స్టాలిన్ ఇపుడు అన్ని విధాలుగా సక్సెస్ అయినట్లే అన్నది ఒక బలమైన విశ్లేషణగా ముందుకు వస్తోంది.