దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో క్లోజ్ అయ్యిందెందుకు?
అంతర్జాతీయ పరిణామాల సంగతి ఎలా ఉన్నా.. దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం ఉత్సాహంతో ఉరుకులు పెడుతున్న సంగతి తెలిసిందే.
అంతర్జాతీయ పరిణామాల సంగతి ఎలా ఉన్నా.. దేశీయ స్టాక్ మార్కెట్ మాత్రం ఉత్సాహంతో ఉరుకులు పెడుతున్న సంగతి తెలిసిందే. అందుకు భిన్నంగా ఈ రోజు (బుధవారం) స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు ఈ రోజు మన మార్కెట్ ను ప్రభావితం చేశాయి. ఉపశమనం కలిగించే అంశం ఏమంటే.. నష్టాలతో మొదలైన ట్రేడింగ్ చివరకు కాస్త కోలుకోవటంతో భారీ నష్టాల నుంచి గట్టెక్కాయి.
మరోవైపు సూచీలు గరిష్ఠస్థాయిలకు చేరిన నేపథ్యంలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపటంతో సూచీలు నష్టపోవటానికి మరో కారణంగా చెబుతున్నారు. సెన్సెన్స్ నిన్న ముగింపు 82,555తో మొదలై 81,845 పాయింట్ల వద్ద నష్టాలతో ట్రేడింగ్ ఆరంభమైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగింది. ఇంట్రాడేలో 81,833 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. ఆ తర్వాత కాస్తంత కోలుకొని 202 పాయింట్ల నష్టంతో 82,352 వద్ద స్థిరపడింది.
ఐసీఐసీఐ బ్యాంక్.. ఇన్ఫోసిస్.. ఎల్ అండ్ టీ షేర్లతో పాటు బ్యాంకింగ్ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి సూచీల మీద పడిన పరిస్థితి. నిఫ్టీ సైతం 81.15 పాయింట్ల నష్టంతో 25,198 వద్ద క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ లో ప్రధానంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. యాక్సిస్.. మహీంద్రా అండ్ మహీంద్రా .. ఇన్ఫోసిస్ ప్రముఖంగా ఉన్నాయని చెప్పాలి.
నిఫ్టీలోని 50 స్టాక్స్ లో 31 నష్టాల్లో ముగిశాయి. విప్రో.. కోల్ ఇండియా.. ఓఎన్ జీసీ.. హిందాల్కో.. ఎల్ టీఐమైండ్ ట్రీ 3 శాతం వరకు నష్టాలు చవిచూశాయి. అదే సమయంలో.. ఏషియన్ పెయింట్స్.. హిందుస్థాన్ యూనిలీవర్.. అల్ట్రాటెక్ సిమెంట్.. సన్ ఫార్మా.. బజాజ్ ఫిన్ సర్వ్ లు2.5 శాతం వరకు లాభపడ్డాయి.