రేవంత్ పై వ్యూహాత్మక ప్రచారం
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఖాతాల్లో ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడుతోనూ భేటీ అయ్యారు.
తెలంగాణ రాజకీయాల్లో ఎన్నికల వేడి హాట్ హాట్‌గా సాగుతున్న సంగతి తెలిసిందే. అధికార బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించేసి కదన రంగంలో ఉత్సాహంగా ముందుకు సాగుతోంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటించేందుకు సన్నద్దం అవుతున్నాయి. ఈ సమయంలోనే టికెట్ల కేటాయింపు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో పుంజుకున్న కాంగ్రెస్ పార్టీలో టికెట్లకు డిమాండ్ పెరిగింది. అయితే, కాంగ్రెస్ పార్టీ కోట్లు ఇస్తే అసెంబ్లీలో బరిలో దిగేందుకు సీట్లు దక్కుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఇదంతా మల్కాజిగిరి సిటింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ గురించి.
తనకు మల్కాజ్‌గిరి టికెట్ ఇవ్వడంతో పాటుగా తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసి... మెదక్ టికెట్ విషయంలో నిరాశ ఎదురవడంతో బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పిన మైనంపల్లి కాంగ్రెస్‌లో చేరనున్న సంగతి తెలిసిందే. ఆయనకు మైనంపల్లి నుంచి ఎమ్మెల్యేగా, ఆయన తనయుడికి మెదక్ నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగేందుకు 'ప్రత్యేక కేటగిరీ'గా ప్రకటించి టికెట్ ఇవ్వనున్నట్లు టీపీసీసీ ఛీఫ్ రేవంత్ ప్రకటించారు. అయితే, దీనిపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తోంది. డబ్బులు ముట్టడంతోనే టికెట్ల కేటాయింపు జరుగుతోందని ఆరోపిస్తోంది.
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో ఖాతాల్లో ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి మైనంపల్లి హన్మంతరావు, ఆయన తనయుడుతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫోటోలలో రెండు సుట్‌కేసులు మార్క్ చేసిన బీఆర్ఎస్ వర్గాలు... ఇవి కోట్లు ఇస్తేనే సీట్లు.... ఇదే కాంగ్రెస్ మార్క్ ట్విస్టు అంటూ ఆరోపిస్తోంది. మైనంపల్లికి రెండు సీట్లు ఇవ్వడంలో రేవంత్ కీలక పాత్ర అంటూ ఆరోపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీని, రేవంత్‌రెడ్డిని పలువురు నెటిజన్లు విమర్శిస్తున్న నేపథ్యంలో రేవంత్ వర్గం ధీటుగా స్పందిస్తోంది. మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటంతో కారు పార్టీలో కలవరం మొదలైందని ఎద్దేవా చేస్తోంది. మైనంపల్లి ఇంకా తమ పార్టీలోనే చేరలేదని, వారికి టికెట్లు ఖరారు అయినట్లు అధికార ప్రకటన వెలువడలేదని చెప్తోంది. ఓటమి భయంతోనే ముందస్తుగా బురదచల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడుతున్నారు.