సంచలనం.. 'యాప్' పడగ నీడలో బైడెన్.. ట్రంప్.. కమలా
దేశాధినేతలు.. ప్రధానుల భద్రతకు అనేక దశలుంటాయి.. వారు తినే ఆహారం దగ్గరనుంచి పర్యటించే ప్రదేశం వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు
దేశాధినేతలు.. ప్రధానుల భద్రతకు అనేక దశలుంటాయి.. వారు తినే ఆహారం దగ్గరనుంచి పర్యటించే ప్రదేశం వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఏమైనా జరిగితే అది దేశానికే చెడ్డ పేరు తెస్తుంది కాబ్టటి ఎటువంటి అవకాశమూ ఇవ్వరు.. ఇక అమెరికా అధ్యక్షుడి భద్రత గురించి అయితే చెప్పేదేముంది..? ఒకప్పుడు మీడియాలో కథలు కథలుగా రాసేవారు.. చూపేవారు. అమెరికా అధ్యక్షుడి విమానం ప్రత్యేకతల నుంచి ఆయన రక్షణ సిబ్బంది కళ్లజోళ్ల వరకు అనేక స్టోరీలు.. కాగా, అలాంటి అమెరికా అధ్యక్షుల జాడను ఎప్పటికప్పుడు పసిగట్టే చాన్స్ ఉందంటూ ఫ్రెంచ్ మీడియా ఒకటి సంచలన కథనం ప్రచురించింది.
స్ట్రావా.. ఎక్కడుందో కనిపెట్టేస్తావా?
దేశాధినేతల పర్యటనలు, కార్యక్రమాల వివరాల విషయంలో భద్రతా సిబ్బంది అత్యంత అలర్ట్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే, ఫ్రెంచ్ మీడియా సంస్థ ఒకటి వెల్లడించిన వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు బైడెన్, తాజా ఎన్నికల్లో తలపడుతున్న డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ), ఉపాధ్యక్షురాలు, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ల లొకేషన్ (ఎక్కున్నదీ) ‘స్ట్రావా’ అనే ఫిట్ నెస్ యాప్ తో తెలిసిపోతుందట. వీరే కాదు.. ఇతర ప్రపంచ నేతల కదలికలనూ ఈ యాప్ పసిగట్టేస్తుందట. అది ఎలాగంటే.. వీరిని అంటిపెట్టుకుని ఉండే బాడీ గార్డులు ఉపయోగించే స్ట్రావా యాప్ ద్వారాన. ఆ యాప్ వాడుతున్నవారిని సులభంగా ట్రాక్ చేయొచ్చట.
పుతిన్, మేక్రన్ కూడా స్ట్రావా నీడలో..
రష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా సిబ్బందితో పాటు తమ దేశ అధ్యక్షుడు మెక్రాన్ భద్రతా సిబ్బంది కూడా స్ట్రావా యాప్ ను వాడుతున్నారని ఫ్రెంచ్ మీడియా తెలిపింది. ఇంతకూ స్ట్రావా ఎలా ఉంటుందో అనుకునేరు...? రన్నర్లు, సైక్లిస్టులు వర్క్ ఔట్లు చేసే సందర్భంలో వాడే యాప్ లాంటిదే ఇది. కాగా, 2021లో మేక్రాన్ నార్మండీ బీచ్ రిసార్ట్ లో ఉండగా.. ఆయన ఎక్కడ ఉన్నదీ అందరికీ తెలిసిపోయింది. మెక్రాన్ బాడీ గార్డులు స్ట్రావా యాప్ వాడడంతో లొకేషన్ ను ట్రాక్ చేశారు. బైడెన్ భార్య జిల్ బైడెన్, ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ భద్రతా సిబ్బంది స్ట్రావా ప్రొఫైల్ ను కూడా ట్రాక్ చేయొచ్చని తేలింది.
జిన్ పింగ్ తో భేటీ సమయంలో..
నిరుడు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లారు. అప్పుడు బైడెన్ ఉన్న హోటల్ చిరునామా ట్రాక్ అయింది. అదెలాగంటే.. బైడెన్ హోటల్ కు రాకముందే.. భద్రతా సిబ్బంది జాగింగ్ సమయంలో స్ట్రావా యాప్ ను వాడారు. సహజంగా దేశాధినేతలు పర్యటించే ప్రాంతాలను భద్రతా సిబ్బంది ముందుగానే ఆధీనంలోకి తీసుకుంటారు. అలాంటప్పడు వారు స్ట్రావా యాప్ వాడితే అధ్యక్షుల కదలికలను ట్రాక్ చేసేయొచ్చు.
ఇది ప్రమాదకరమే..
స్ట్రావా ద్వారా అధ్యక్షుల కదలికల ట్రాకింగ్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది భద్రతా ఉల్లంఘనకు దారితీస్తుందనే విమర్శలు వస్తున్నాయి. అధ్యక్షుల భద్రతకు బాధ్యతను పర్యవేక్షించే 26 మంది అమెరికా, 12 మంది ఫ్రాన్స్, ఆరుగురు రష్యా రక్షణ సిబ్బందిని గుర్తించామని ఫ్రెంచ్ మీడియా ప్రకటించింది. పేర్లు మాత్రం చెప్పలేదు. కాగా, ఈ కథనంపై అమెరికా అధ్యక్షుడి భద్రతను చూసే సీక్రెట్ సర్వీస్ స్పందించింది. తమ సిబ్బంది విధుల్లో ఉండగా వ్యక్తిగత ఎలక్ట్రానిక్ పరికరాలు వాడేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. విధుల్లో లేని సమయంలో మాత్రం వాడొచ్చని పేర్కొంది. అయితే, సిబ్బంది నిబంధనల్లో ఏమైనా మార్పులు చేయాలా? అని తేల్చేందుకు ఫ్రెంచ్ మీడియా సమాచారాన్ని సమీక్షిస్తామని మాత్రం చెప్పింది.
కొసమెరుపు: తమ దేశానికి చెందిన మీడియా సంస్థ కథనంపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కార్యాలయం మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. స్ట్రావాలో పేర్కొన్న సమస్యలతో తమ అధ్యక్షుడి భద్రతపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.