అడకత్తెరలో మాజీ హోం మంత్రి రాజకీయం!
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత 2009లో విజయం దక్కించుకున్నారు.
ఏపీ మాజీ హోం మంత్రి, తొలిసారి ఈ పదవిని దక్కించుకున్న ఎస్సీ నాయకురాలు మేకతోటి సుచరిత రాజకీయాలు అడకత్తెరలో చిక్కుకున్నాయి. ఆది నుంచి వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్న సుచరిత కుటుంబం.. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో ముందుకు సాగింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి సుచరిత 2009లో విజయం దక్కించుకున్నారు. తర్వాత.. వైఎస్ మర ణంతో ఆమె జగన్ వెంట నడిచారు.
ఈ క్రమంలోనే 2019లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు. అనంతరం తొలి ఎస్సీ హొం మంత్రిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. రెండున్నరేళ్ల తర్వాత ఆమెను ఈ పదవి నుంచి తప్పించిన జగన్.. ఎన్నికలకు ముందు నియోజకవర్గం కూడా మార్చేశారు. ప్రత్తిపాడు నుంచి తీసుకువచ్చి తాడికొం డ టికెట్ ఇచ్చారు. అయితే.. ఈ ఎన్నికల్లో ఆమె పరాజయం పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే తాను నియో జకవర్గంలో ఉండలేనని తేల్చి చెప్పారు.
అనంతరం.. ఆమె తన సొంత నియోజకవర్గానికే పరిమితయ్యారు. అయితే.. ప్రత్తిపాడు బాధ్యతలను మాత్రం వైసీపీ ఆమెకు అప్పగించలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన బలసాని కిరణ్ కుమార్‌నే కొనసాగి స్తోంది. ఈ పరిణామాలతో సుచరిత రాజకీయం అడకత్తెరలో పడింది. నియోజకవర్గంలో ఆమెను పట్టించుకునే వారు కనిపించడం లేదు. పైగా అధిష్టానం నుంచి ఎలాంటి సందేశం కూడా రావడం లేదు. దీంతో పార్టీలో ఉండాలో.. వద్దో కూడా.. తెలియని అయోమయ పరిస్థితిని సుచరిత ఎదుర్కొంటున్నారు.
ఇదిలావుంటే, గతంలో ప్రత్తిపాడు నియోజకవర్గంలో సుచరితకు ఉన్న పట్టు ఇప్పుడు లేకుండా పోయిం ది. ఆమె సానుభూతి పరులు కూడా.. ఆమెకు దూరమయ్యారు. ఇదేసమయంలో ఆమెకు సంస్థాగతంగా ఉన్న ఓటు బ్యాంకు కూడా దూరమైంది. ఇది మరింత ఇబ్బందిగా మారిపోయింది. ఈ పరిణామాలతో ఇటు వైసీపీలో ఉండలేక, అటు ఎవరి నుంచి ఆహ్వానాలు కూడా అందక.. సుచరిత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తానికి సుచరిత రాజకీయం అయితే.. అడకత్తెరలో పడిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.