జ‌న‌సేన‌కు లేని నొప్పి.. టీడీపీకి ఎందుకు..?

వైసీపీకి ఓటు వేశార‌నే కార‌ణంగా సైనికుడి కుటుంబం ఇంటిని కూల్చివేశారని బాధితులే చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం.

Update: 2024-07-28 12:30 GMT

రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప‌రిణామాల‌పై అధికార పార్టీ టిడిపి పై విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో వైసిపి నాయకులను అడ్డుకోవడం, వైసిపి నేతలపై దాడులు చేయటం వంటివి ఎక్కడా ఆగడం లేదు. పైగా వైసీపి నాయకుల ఆస్తులను సైతం ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా విజయనగరంలో ఓ సైనికుడి ఇంటిని కూల్చివేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. వైసీపీకి ఓటు వేశార‌నే కార‌ణంగా సైనికుడి కుటుంబం ఇంటిని కూల్చివేశారని బాధితులే చెప్పడం ఇక్కడ ప్రస్తావనార్హం. నిజానికి ఇలాంటి దాడులు గతంలో జరిగినప్పుడు టిడిపి నాయకులు గగ్గోలు పెట్టారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదు అని కూడా చేప్పారు. కానీ ఇప్పుడు వారే అధికారంలో ఉండి ఇలాంటి దాడులు చేయడంతో పరిస్థితి చేయి దాటిపోతుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వందలాది మందిపై దాడులు జరిగాయని తమ వారిని 36 మందిని చంపేశారని వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు. ఆ వేడే ఇంకా చల్లార‌లేదు. ఈ నేప‌థ్యంలో తాజాగా విజయనగరంలో జ‌రిగి ఘటన మరింత ఆశ్చర్యకరంగా, మరింత వివాదంగా మారంది. ఇక్కడ చిత్రం ఏంటంటే ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు జనసేన నాయకుల పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

జనసేనకు మద్దతు పలికిన వారి ఆస్తుల‌ను కూడా ధ్వంసం చేశారని నేరుగా పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీనికి ఇప్పటం గ్రామంలో జరిగిన ఘటన పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అప్పట్లో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించిన సమయంలో ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు రైతులు భూమిని ఇచ్చారనే కారణంతో వారి ఇళ్ళను కూల్చేశారని పవన్ కళ్యాణ్ ఆరోపించడం వారిని పరామర్శించేందుకు వెళ్లి హల్చల్ చేయడం అందరికీ తెలిసిందే. అదేవిధంగా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను సైతం నేరుగా విమర్శించారు. ఆయన కులాన్ని విమర్శిస్తూ ముద్రగడ పద్మనాభం సైతం ఆరోపణలు చేశారు.

ఇక ఆయన పెళ్లిళ్లు విషయాన్ని ప్రస్తావిస్తూ నేరుగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలోనే వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతగా జనసేనను కూడా టార్గెట్ చేసిన వైసీపీని ఇప్పుడు జనసేన నాయకులు ఒకరంటే ఒకరు కూడా టార్గెట్ చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 21 మంది జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో పవన్ కళ్యాణ్ ను పక్కనపెట్టినా 20 మంది ఉన్నారు. 20 మందిలో ఒక్కరు కూడా వైసీపీ నేతలను టార్గెట్ చేయడం గానీ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేయడం గాని చేయటం లేదు. కానీ టిడిపి నాయకులు మాత్రం వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో దాడులు చేయడం మంచిదేనా?

వీరికి ఎందుకు ఇంత బాధ కలుగుతోంది. అనేది ప్రస్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వాస్త‌వానికి దీనిని కట్టడి చేస్తున్నామని కార్యకర్తలు, నాయకులు ఎవరూ కూడా దాడులకు పాల్పడవద్దని పై స్థాయిలో చంద్రబాబు, నారా లోకేష్ చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం నాయకులు వినిపించుకోకపోవడం, కనీసం అధినేతల మాటలు పట్టించుకోకపోవడం ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. చంద్రబాబు అయినా నాయకులు కార్యకర్తలు తమను నిగ్రహించుకుని అదుపులో ఉంటే రాజకీయంగా వివాదాలకు తెర‌పడే అవకాశం ఉంటుంది. లేక‌పోతే.. ముందు ముందు మ‌రిన్ని వివాదాలు రావ‌డం ఖాయం.

Tags:    

Similar News