రాత్రంతా గర్బిణి మెడపై కత్తి పెట్టినోడు సూసైడ్
చట్టబద్ధంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది
కొద్దిరోజుల క్రితం జూబ్లీహిల్స్ లోని ఒక భారీ భవంతిలోకి అక్రమంగా ప్రవేశించి.. గర్బిణి మెడ మీద కత్తి పెట్టి రూ.10 లక్షలు దోచుకెళ్లిన ఉదంతం గుర్తుంది కదా? సదరు ఘటనలో నిందితుడు తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఐటీ ఉద్యోగి అయిన అతడు అప్పులపాలై.. వాటిని తీర్చటం కోసం చేసిన ఈ వెధవ పని అతడిపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.
రోటీన్ కు భిన్నంగా జరిగిన ఈ ఉదంతాన్ని హైదరాబాద్ నగర్ పోలీసులు సీరియస్ గా తీసుకోవటం.. రోజుల తరబడి వేలాది సీసీ కెమేరాల్ని వడబోసి.. చివరకు నిందితుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకోవటం తెలిసిందే.
ఈ ఉదంతంలో నిందితుడి గురించిన సమాచారం బయటకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ కు చెందిన 26 ఏళ్ల రాజేశ్ ఐటీ ఉద్యోగిగా సికింద్రాబాద్ లో ఉంటూ.. జల్సాలతో పెద్ద ఎత్తున అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు జూబ్లీహిల్స్ లోని ఒక భారీ భవంతి లోపలకు చేరుకొని.. పై అంతస్తులో నిద్రిస్తున్న గర్బిణి మెడ మీద కత్తి పెట్టి.. ఇంట్లో వారిని బెదిరించి భారీగా దోచేశాడు.
ఈ ఘటనలో అరెస్టు అయిన రాజేశ్ ను రిమాండ్ కు తరలించారు. ఈ నెల 30న జైలు నుంచి బయటకు వచ్చిన ఇతని ఘనకార్యం తెలియటంతో అతడి కుటుంబ సభ్యులు.. బంధువుల ఎదుట పరువు.. మర్యాద పోయింది.
దీంతో.. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన అతడు.. గురువారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మొత్తం ఉదంతంలో నీతి ఏమంటే.. తప్పుడు పనులు చేయటం తర్వాత.. ఆ పరిస్థితి వరకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులు చేసి దొరకమన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో అసాధ్యం. అందుకే.. చట్టబద్ధంగా జీవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.