విజయవాడలో ఫ్లెక్సీల వార్... ఎమ్మెల్యే సుజానను టార్గెట్ చేస్తోందెవరు..?
వాస్తవానికి అప్పట్లో సుజనా చౌదరి ఏయే ప్రాంతాల్లో తనకు అనుకూలంగా ఫ్లెక్సీలు పెట్టించారో.. ఇప్పుడు అక్కడే కొన్ని వార్డుల ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు.
విజయవాడ వెస్ట్‌లో ఎమ్మెల్యే కోసం ప్రజలు కలవరిస్తున్నారు. నియోజకవర్గానికి తాను గెలిచిన వెంటనే అన్నీ చేశానని.. ఎన్నో చేస్తున్నానని.. టీడీపీ మాజీ నాయకుడు, ప్రస్తుత బీజేపీ నేత, ఎమ్మెల్యే సుజనా చౌదరి ఫ్లెక్సీలు వేయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక వార్తలు కూడా వచ్చాయి. అయితే.. ఇప్పుడు అవే ప్లేసుల్లో మరో రూపంలో ఫ్లెక్సీలు కడుతున్నారు. అవే.. ``మా ఎమ్మెల్యే ఎక్కడ`` అని! మరి దీనికి రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది.
వాస్తవానికి అప్పట్లో సుజనా చౌదరి ఏయే ప్రాంతాల్లో తనకు అనుకూలంగా ఫ్లెక్సీలు పెట్టించారో.. ఇప్పుడు అక్కడే కొన్ని వార్డుల ప్రజలు ఫ్లెక్సీలు పెట్టారు. దీంతో ఈ విషయం ఆసక్తిగా మారి.. సోషల్ మీడియాకు ఎక్కింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజాగా బుడమేరు పొంగింది. దీంతో విజయవాడ పశ్చిమ నియోజక వర్గం పరిధిలోని వించిపేట, కొత్తపేట, చిట్టినగర్, భానునగర్, ఆర్టీసీ కాలనీ ఇలా.. దాదాపు సగానికిపైగా శివారు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎనిమిది రోజులుగా వారికి ఇబ్బందులే.
పోనీ. సర్కారు సాయం అందుతోందా? అంటే.. అంతంత మాత్రంగానే ఉంది. పీకల్లోతు నీటిలో వెళ్లలేక సహాయక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఒక పూట తింటే మరో పూట వారికి తిండిలేదు. అంతో ఇంతో తెరిపి ఇచ్చినా.. రహదారులపై మేటలు వేసిన.. బురద, చెత్తతో ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నారు. అంతకుముందు.. వారానికి ఒక్కసారైనా కనిపించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి పీఏ.. ఇప్పుడు రావడమే మానేశారు. దీంతో ఇక్కడి ప్రజలు వేచి చూసి.. విసిగిపోయారు.
మరోవైపు.. వైసీపీ నాయకులు కూడా కనిపించడం లేదు. ఇదొకలెక్కగా ఉంది. అయితే.. మెజారిటీ ప్రజలు మాత్రం ఎమ్మెల్యే కోసం వేచి చూస్తున్నారు. తమను ఆదుకుంటారని వారు భావిస్తున్నారు. కానీ, సుజనా మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. ఆయన తొలి రోజు మాత్రం(గత ఆదివారం1వ తేదీ) సీఎం చంద్రబాబును కలిసి రూ.5 లక్షలు సాయం చేసి వెళ్లిపోయారు. ఇక, ఆతర్వాత ఆయన కనిపించలేదు. దీంతో ప్రజలు కొందరు మా ఎమ్మెల్యే ఎక్కడ? అంటూ.. ఫ్లెక్సీలు కట్టారు. అయితే.. చిత్రం ఏంటంటే.. మునిసిపల్ సిబ్బంది వాటిని తొలగించేశారు. మళ్లీ మళ్లీ కడుతున్నా.. నిరంతరాయంగా వాటిని తొలగించే పనిలో ఉండడం గమనార్హం.