భట్టి విక్రమార్కపై బాల్క సుమన్ వ్యాఖ్యలు కరెక్టేనా?
అలాంటి కులం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా నిలుస్తోంది.
మనదేశంలో ఎందుకు పనికి రాని కులం రాజకీయాల్లో మాత్రం బాగా పనిచేస్తుంది. మంచి టానిక్ లా మారుతుంది. ఎదుటి వారిని ప్రలోభాలకు గురి చేసేందుకు ప్రధానంగా ఉపయోగడుతుంది. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ఆజ్యం పోస్తుంది. అన్నదమ్ముల వలె కలిసుండే వారి మధ్య పగ, ప్రతీకారాలకు కేంద్రంగా నిలుస్తుంది. క్యాష్, క్యాస్ట్ కు పడని వాడు రాజకీయాల్లో ఉండరని చెబుతుంటారు. అలాంటి కులం ప్రస్తుతం రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రంగా నిలుస్తోంది. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కులం బలం కోసం పోరాడుతుండటం విశేషం.
తాజాగా ఓ వేదికలో కాంగ్రెస్ మంత్రులు కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పెట్టి దళితులకు అవమానం జరిగిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గొంతు చించుకోవడం గమనార్హం. అసలు ఎక్కడ మోసం జరిగింది? ఎలా జరిగింది? అనే విషయాలను పక్కన పెడితే ఆయన వాదనకు అర్థం ఏమిటో తెలియడం లేదు. ఒక కార్యక్రమంలో ఒకే వరసలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు కూర్చున్నారు. వారి పక్కనే మరో మంత్రి విక్రమార్క కూర్చున్నారు.
భట్టి విక్రమార్కను కింద కూర్చోబెట్టారు? దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఏం చెబుతారని వాదించడం వివాదాలకు తావిస్తోంది. అసలు బాల్క సుమన్ ఎందుకు ఈ చర్చకు తెరలేపారో అర్థం కావడం లేదు. వెనక కొందరు నిలబడ్డారు. ముందు వీరు కూర్చున్నారు. దానికి దళితులకు అవమానం అంటూ మొసలి కన్నీరు కార్చడం అవసరం లేదు. ఇలా అనవసర ప్రేలాపణలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
ప్రజాసమస్యల గురించి మాట్లాడమంటే వ్యక్తిగత దురుద్దేశాలు ఆపాదిస్తూ మరింత దిగజారిపోతున్నారు. రాజకీయాల్లో హుందాగా ఉండాల్సిన నేతల విచిత్ర వైఖరికి ఆశ్చర్యపోతున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించి వాటి పరిష్కారానికి మార్గాలు చూపించాల్సిన వారే వ్యక్తిగత విషయాలకు ప్రాధాన్యమిస్తూ వారి కుటిల బుద్ధిని ప్రదర్శిస్తున్నారు. బాల్క సుమన్ మాటలు చిన్న పిల్లల చేతల్లా ఉన్నాయని పలువురు రాజకీయ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం.
ఎక్కడ కూర్చున్నారు? ఏం చేస్తున్నారు? అని కాకుండా ప్రజల కోసం ఏం పనులు చేపడుతున్నారు? పనుల్లో ఎలాంటి విధానాలు పాటిస్తున్నారని మాట్లాడటం బాగుంటుంది. కానీ ఇలా దిగజారిపోయే మాటలు మాట్లాడి వారి గాంభీర్యానికి చెక్ పెట్టుకోవడం వారికే మంచిది కాదు. నాయకుడంటే ప్రజల పక్షాన నిలిచి పోరాడాలి. ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించాలి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల చేతకాని మాటలు మాని ప్రజాహితం కోసం శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తుంచుకోవడం మంచిది.