సునీల్ రిపోర్టే ఫైనలా ?
పార్టీలోని కొందరు సీనియర్లతో సునీల్ కు వివాదం రేగిన కారణంగా అర్ధాంతరంగా తెలంగాణాను వదిలేసి కర్నాటకకు వెళ్ళిపోయారు
తెలంగాణా కాంగ్రెస్ లో పోటీ విషయంలో ఆశావహుల నుండి సీనియర్లపై బాగా ఒత్తిడి పెరిగిపోతోంది. ఒకవైపు ప్రదేశ్ ఎన్నికల కమిటీ 1220 దరఖాస్తులను వడపోసింది. 119 నియోజకవర్గాల్లో పోటీకి 1220 దరఖాస్తులు వచ్చాయంటేనే టికెట్ కోసం ఎంత పోటీ ఉందో అర్ధమవుతోంది. ఇందులోనే 30 నియోజకవర్గాల్లో తలా ఒక్కో దరఖాస్తు వచ్చింది. అంటే 30 నియోజకవర్గాల్లో 30 మంది అభ్యర్ధులకు టికెట్లు వచ్చేసినట్లే అనుకోవాలి. మిగిలిన 89 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం బాగా పోటీ ఉంది.
ఇందుకోసం ఏఐసీసీ నుండి స్క్రీనింగ్ కమిటి సభ్యులు వచ్చి సుదీర్ఘంగా సమావేశం అయ్యారు. అనేక స్ధాయిల్లోని నేతలతో సమావేశం అయిన తర్వాత 1:3 గా వడపోశారు. అంటే ఒక నియోజకవర్గంలో ముగ్గురు ఆశావహులను స్క్రీనింగ్ కమిటి ఎంపిక చేసింది. ఈ జాబితాను స్క్రీనింగ్ కమిటి ఏఐసీసీ కమిటీకి పంపింది. సరిగ్గా ఈ సమయంలో సునీల్ కనుగోలు ఎంటరయ్యారు. సునీల్ అంటే తెలంగాణా కాంగ్రెస్ కు చాలాకాలం రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తి.
పార్టీలోని కొందరు సీనియర్లతో సునీల్ కు వివాదం రేగిన కారణంగా అర్ధాంతరంగా తెలంగాణాను వదిలేసి కర్నాటకకు వెళ్ళిపోయారు. కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ కు సునీలే పనిచేశారు. కాబట్టి అక్కడ ప్రభుత్వానికి సలహాదారుగా వెళ్ళిపోయారు. అలాంటి వ్యక్తి సడెన్ గా మళ్ళీ తెలంగాణాలో ప్రత్యక్షమయ్యారు. సునీల్ తరపున ఆయన బృందం గ్రౌండ్ ఇంటెలిజెన్స్, పొలిటికల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్ వింగ్, క్యాంపెయిన్ వింగ్, సోషల్ మీడియా వింగ్ లాంటివి యథావిధిగా పనిచేస్తున్నాయి.
కాబట్టి ఆశావహుల నేపథ్యం, బలం, బలహీనతలు అన్నీ సునీల్ కు పక్కాగా తెలుసు. ఆశావహులకు సంబంధించిన పూర్తి చరిత్ర సునీల్ చేతిలో ఉన్నాయి. కాబట్టి ఎన్ని కమిటీలు సమావేశమైనా, ఎవరిని సిఫారసుచేసినా ఫైనల్ అయ్యేది సునీల రికమెండేషన్ మాత్రమే అని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే సునీల్ నేరుగా ఏఐసీసీకి మాత్రమే జవాబుదారి కాబట్టి. కాంగ్రెస్ డిక్లరేషన్లు, కేసీయార్ ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ హామీలు, క్యాంపెయిన్ స్ట్రాటజీ మొత్తాన్ని సునీలే ఫైనల్ చేయబోతున్నారు. మొత్తానికి సునీల్ రిపోర్టే ఫైనల్ అని అర్ధమవుతోంది.